హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్‌డీపీటీ) ఆధ్వర్యంలో గురువారం రాత్రి అర్చకులు, ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్లతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం ఏఈఓ పి.నటరాజారావు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అర్చకులు తమ జీవనోపాధి, గౌరవ వేతనాల పెంపు, పెండింగ్ బకాయిలు విడుదల, చిన్న దేవాలయాల అభివృద్ధి, దేవాలయ ఆస్తుల రక్షణ, హుండీ లెక్కల పారదర్శకత, గోశాలల పరిరక్షణ, అర్చకుల వైద్య–పింఛన్ భద్రత తదితర అంశాలపై విస్తృతంగా విన్నపాలు చేశారు. వీటిపై శ్రీనివాసులు స్పందిస్తూ అర్చకుల అభ్యర్థనలను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. వీటిని సమగ్రంగా సంకలనం చేసి ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ప్రతిపాదనల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పెదవేగి: ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై ఎం.హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయిలోని నూజివీడు సీడ్స్ ఫ్యాక్టరీలో బిహర్‌కు చెందిన దుర్గేష్ గత 5 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. దుర్గేష్ తమ్ముడైన చోటు కుమార్‌సాహ్ కూడా ఆరు నెలల క్రితం అన్న పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే చేరాడు. ఈ నెల 19న అన్నదమ్ములు ఓవర్ డ్యూటీ చేసే ప్రక్రియలో ఫ్యాక్టరీలో పైకి ఎక్కి పనిచేస్తుండగా, ప్రమాదవశాత్తు దుర్గేష్‌కు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని హుటాహుటిన ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 20న దుర్గేష్(32) మృతిచెందినట్లు ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ద్వారకాతిరుమల: మండలంలోని గొల్లగూడెంలో ఓ వ్యభిచార గృహంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్టు చేసి, ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన పంచవ నాగమణి ఇంటికి విటులను రప్పించి, గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌లకు సమాచారం అందింది. దాంతో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసేందుకు సిబ్బందితో కలసి మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాగమణిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సుధీర్ తెలిపారు.
తాడేపల్లిగూడెం: నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిఽశోధనలు సాగుతున్నాయని దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయ బ్రెయిన్ పూల్ సైంటిస్టు డాక్టర్ గెడ్డా గంగరాజు తెలిపారు. ఏపీ నిట్‌లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఫర్ బయోమెడికల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అప్లికేషన్ అంశంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలుగకుండా సహజ వనరులను ఉపయోగించి నానో పదార్తాలను తయారుచేసే విధానాన్నే గ్రీన్ సింథసిస్ అంటారన్నారు. ఈ గ్రీన్ సింథసిస్ పద్ధతి పర్యావరణ పరిరక్షణతో పాటు సమర్ధవంతమైన జీవవైద్య పరిష్కారాలను చూపించే భవిష్యత్ సాంకేతికతగా గుర్తింపు పొందుతుందన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగాఽధిపతి డాక్టర్ వినోద్‌కుమార్ రాజా, ఆచార్యులు కుల్దీప్ రాయ్, సుశాంత్ బెహరా తదితరులు పాల్గొన్నారు.


