నూజివీడు బస్టాండ్‌లో అసౌకర్యాలపై ఆగ్రహం
నూజివీడు: నూజివీడు బస్టాండు నిర్వహణపై కలెక్టర్ వెట్రిసెల్వి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండును బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో ఫ్లోరింగ్ దెబ్బతిని ఉండటం, రైలింగ్ పడిపోవడం వంటివి చూసి ఎందుకు మరమ్మత్తులు చేయించడం లేదని ప్రశ్నించారు. బస్సులు ఆగే చోట ప్లాట్‌ఫాం దిమ్మెలకు రంగులు వేయడం చూసి నేను వస్తున్నానని రంగులు వేయిస్తున్నారని బ్యూటిఫికేషన్ ముఖ్యం కాదని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. బస్టాండు ఆవరణలో సీసీ కెమేరాలు పనిచేస్తున్నాయా అని ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నమిలారు. బస్టాండులోని పలు షాపుల్లో కాలం చెల్లిన తినుబండారాలు విక్రయించకుండా వారం వారం వాటిని తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. అధిక ధరలకు కూడా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండులోని టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ను పరిశీలించగా కంప్యూటర్ పనిచేయడం లేని విషయాన్ని గమనించారు. పది రోజుల్లో బస్టాండు నిర్వహణలో మార్పు రావాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాధికారి షేక్ షబ్నమ్, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఎం పీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


