జీవో 36 అమలు చేయాలి
నూజివీడు: తమ సమస్యలను పరిష్కరించాలని, రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 16నుంచి సహకార ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా పట్టణంలోని కేడీసీసీబీ బ్రాంచ్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ఉన్న మొత్తం 29 సొసైటీలకు సంబంధించిన 100 మంది సిబ్బంది బ్రాంచ్ ముందు బైటాయించారు. దీక్షలకు ఏఐటీయూసీ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు ఎన్‌ఆర్ హనుమాన్లు, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కినేని ఆంజనేయప్రసాద్ తదితరులు తమ మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 36ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల యూనియన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం శ్రీనివాసరావు, పలు సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


