త్వరలో వశిష్ట వారధి నిర్మాణ పనులు
భీమవరం: నరసాపురం ప్రజల చిరకాల వాంచ ఎన్‌హెచ్‌ఎ–216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని, వశిష్ట వారధి, నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ త్వరలోనే బైపాస్ రోడ్ నిర్మాణ పనులు, వశిష్ట వారధి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. రెండు లైన్ల రహదారిగా ఉన్న ఎన్‌హెచ్ 216ను నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి అధికారులు అంగీకరించారని తెలిపారు. ఎన్‌హెచ్ 216 నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు ఎన్‌హెచ్ 165 దిగమర్రు ఆకివీడు రహదారి, భీమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.


