ఇష్టారాజ్యంగా కోళ్ల వ్యర్థాల రవాణా
కోళ్ల వ్యర్థాలు తరలిస్తే కఠిన చర్యలు
గణపవరం: ఎన్ని చట్టాలు.. ఎంత నిఘా ఉన్నా కోళ్ల వ్యర్థాల రవాణా నిరాటంకంగా సాగుతోంది. ఒకవైపున పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రమాదమని తెలిసినా కోళ్లు, ఇతర జంతు వ్యర్థాలను యథేచ్ఛగా, పట్టపగలే దర్జాగా రవాణా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన కోళ్ల వ్యర్థాలు మన రాష్ట్రంనుంచే కాక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా వాహనాల్లో కొల్లేరు, డెల్టా ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా మాంసాహారం అధికంగా వినియోగించే ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు చికెన్ దుకాణాలు, చేపల మార్కెట్‌ల వద్ద దుకాణదారులు వాటి వ్యర్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో వేసి ఉంచుతారు. వాటిని తరలించడానికి దుకాణదారులతో దళారులు ఒప్పందం చేసుకుని, వాటిని రాత్రి వేళల్లో రహస్యంగా సేకరించి వాటిని మినీ లారీలు, వ్యాన్‌లు, ట్రక్కు ఆటోల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీని నిమిత్తం వ్యాపారులకు ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల వరకూ చెల్లిస్తుంటారు.
ప్రభుత్వం నిషేధించినా..
పర్యావరణానికి పెనుప్రమాదకరమైన కోళ్లు ఇతర జంతు వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడాన్ని నిషేధిస్తూ దశాబ్దకాలం క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొందరు అక్రమార్కులు మాత్రం రహస్యంగా కోళ్ల వ్యర్థాలను తరలిస్తూనే ఉన్నారు. ఎక్కువగా రాత్రి సమయంలో అర్ధరాత్రి, తెల్లవారుజామున వీటిని తరలిస్తుండగా మరికొందరు పట్టపగలే వీటిని తరలిస్తూ ప్రజలను నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవలి కాలంలోనే నిడమర్రు సర్కిల్ పరిధిలో పోలీసులు రాత్రివేళల్లో డజనుకుపైగా కోళ్లవ్యర్థాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు పెట్టారు.
ఆరోగ్యానికి పెనుముప్పు
కోళ్లవ్యర్థాలు రవాణా చేస్తున్న వాహనం రోడ్డుమీద వెళ్లిందంటే ఆ వాహనం వెళ్లిన అరగంట వరకూ దాని దుర్వాసన దారుణంగా ఉంటుంది. ఇలాంటి వాహనాలు వెళ్తుంటే దానినుంచి వెలువడే దుర్గంధంతో రోడ్డున వెళ్లే ప్రయాణికులు, రోడ్లవెంబడి ఉన్న వ్యాపారులు, దుకాణదారులు, సమీప గృహస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతున్నా స్వార్థంతో కొందరు ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఖర్చు తక్కువని..
చేపలకు మేతగా డీవోబి (నూనె తీసిన తౌడు) వినియోగిస్తుంటారు. దీని ధర ఆరు నెలలకు సగటున మూడు లక్షల వరకూ ఖర్చవుతుంది. దీని స్థానంలో మాంసం వ్యర్థాలను మేతగా వేస్తే లక్ష రూపాయల లోపే ఖర్చు అవుతుంది. చేపల మేత కిలో రూ.40 వరకూ ఉండగా చికెన్ వ్యర్థాలు రూ.10 కే రావడంవల్ల రైతులు వీటిపై మక్కువ చూపుతున్నారు. ఎకరా చేపల చెరువకు సంప్రదాయ మేత నెలకు సుమారు రూ.35 వేలు ఖర్చు అవుతుంది. అదే కోళ్ల వ్యర్థాలు 200 కిలోల డ్రమ్ము రూ.2 వేలకు వస్తుంది. ఈ లెక్కన నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో ఖర్చు సగానికి సగం తగ్గడంవల్ల రైతులు కోళ్లవ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలను ఏరోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా ఆదాయం వస్తుందన్న ఆశతో వ్యాపారులు వీటిని దాచి ఉంచి దళారులకు విక్రయిస్తున్నారు.
కోళ్ల వ్యర్థాల రవాణాపై గట్టి నిఘా పెట్టాం. పర్యావరణానికి అత్యంత హానిచేసే వీటిని రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే సర్కిల్ పరిధిలో పలు వాహనాలు పట్టుకుని కేసులు నమోదు చేశాం. వ్యాపారులపై నిఘా ఉంచి కోళ్లవ్యర్థాలు రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. చేపల రైతులు కూడా వీటిని వినియోగించకూడదు. – నక్కా రజనీకుమార్, సీఐ, గణపవరం
చేపల చెరువుల కోసం యథేచ్ఛగా కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణా
పోలీసులు దాడులు చేస్తున్నా ఆగని దందా
పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రమాదం అంటున్న అధికారులు
ఇష్టారాజ్యంగా కోళ్ల వ్యర్థాల రవాణా
ఇష్టారాజ్యంగా కోళ్ల వ్యర్థాల రవాణా


