గల్ఫ్‌లో మహిళ మృతి..కానిస్టేబుల్‌ దంపతులపై కేసు | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో మహిళ మృతి..కానిస్టేబుల్‌ దంపతులపై కేసు

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

గల్ఫ్‌లో మహిళ మృతి..కానిస్టేబుల్‌ దంపతులపై కేసు

గల్ఫ్‌లో మహిళ మృతి..కానిస్టేబుల్‌ దంపతులపై కేసు

గల్ఫ్‌లో మహిళ మృతి..కానిస్టేబుల్‌ దంపతులపై కేసు రైల్వే గేటు దాటుతుండగా.. సన్మార్గంలో నడిస్తేనే ఏసుకు చేరువ బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

నరసాపురం రూరల్‌: ఉపాధి పేరిట నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్‌ దేశానికి పంపి, ఒక మహిళ మృతికి కారణమైన కానిస్టేబుల్‌ దంపతులపై నరసాపురం రూరల్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన మురాల రాజమణి (48) గతంలో గల్ఫ్‌ దేశాల్లో పనిచేసి వచ్చి, ఇకపై వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఉండి మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన బింకం విమల, ఆమె భర్త భీమవరంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు రాజమణి ఇంటికి వచ్చి, మెరుగైన ఉపాధితో పాటు ఎక్కువ జీతం ఆశచూపి మస్కట్‌ పంపిస్తామని నమ్మబలికారు. మృతురాలు మొదట నిరాకరించినప్పటికీ, కానిస్టేబుల్‌ యేసేబు వచ్చి చెప్పడంతో గల్ఫ్‌ వెళ్లేందుకు అంగీకరించింది. ఇందుకుగాను నిందితులు రూ.2 లక్షలు డిమాండ్‌ చేయగా, రాజమణి కూతురు ఉషారాణి రూ.1.50 లక్షలు చెల్లించింది. దీంతో రాజమణిని 2025 నవంబర్‌ 28న గల్ఫ్‌ పంపారు. రాజమణి అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే, డిసెంబర్‌ 4న ఆమె మరణించినట్లు నిందితులు సమాచారం ఇచ్చారు. వర్కింగ్‌ వీసా అని చెప్పి విజిటింగ్‌ వీసాపై పంపడం వల్ల రాజమణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, ఆరోగ్యం క్షీణించినా అక్కడ ఉన్న బింకం విమల సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిందని బాధితులు ఆరోపించారు. ఉషారాణి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసాపురం రూరల్‌ ఎస్సై వెంకట సురేష్‌ తెలిపారు.

భీమడోలు: రైల్వే గేటు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో ఆతను అక్కడిక్కడే మృతి చెందాడు. ద్వారకాతిరుమలకు చెందిన సీమకుర్తి జ్యోతి కృష్ణ గణపతి(51) ఈనెల 14వ తేదీ రాత్రి భీమడోలులోని రైలు గేటు దాటుతుండగా అదే సమయంలో డిబ్రూగర్‌ వివేక్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆతను అక్కడిక్కడమే మృతి చెందాడు. తొలుత కృష్ణ గణపతిది ఆత్మహత్యగా భావించగా అతడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సన్మార్గంలో నడిచే విశ్వాసులు ఏసు ప్రభువుకు చేరువవుతారని పాస్టర్‌ ఎం జ్యోతి రాజు అన్నారు. స్థానిక శాంతినగర్‌ మన్నా చర్చ్‌ పాస్టర్‌ జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభమైన స్తుతి నైవేధ్యం కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. స్థానిక గ్జేవియర్‌ నగర్‌లోని సెయింట్‌ గ్జేవియర్‌ స్కూల్‌ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాక్య పరిచర్య చేసిన జ్యోతిరాజు మాట్లాడుతూ ఏసు ప్రభువు చూపిన మార్గం ప్రపంచానికి అనుసరణీయమన్నారు. విశ్వశాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని, బైబిల్‌ పఠనం ద్వారా మన నడవడికలో సమూల మార్పు వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా వాద్య సంగీతాల మధ్య ఆలపించిన సువార్త గీతాలు విశ్వాసులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దైవజనులు రాజ్‌ ప్రకాష్‌ పాల్‌, మోసన్న జాన్‌ వెస్లీ, రాజమండ్రి, విశాఖపట్నం నుంచి శామ్యూల్‌ ఖర్మోజీ, పలువురు అంతర్జాతీయ సువార్త గాయకులు, సంగీత కళాకారులు పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌: బైక్‌ అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొగల్తూరు హెడ్‌ కానిస్టేబుల్‌ సుబానీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ చల్లా పవన్‌ కుమార్‌ (27) తన స్నేహితుడు చంద్రగిరి దుర్గారావుతో కలిసి మోటార్‌బైక్‌పై ఆదివారం పేరుపాలెం బీచ్‌కి వచ్చారు. తిరిగి ఉండి వెళ్లే క్రమంలో మోడి గ్రామానికి చేరుకునేసరికి వారి బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్‌ కుమార్‌ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరి బత్తుల పెద్దింట్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వ్యక్తి దుర్గారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు.

కొట్లాట కేసులో మూడేళ్ల జైలు శిక్ష

పెంటపాడు: కొట్లాట కేసులో ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించినట్లు పెంటపాడు ఎస్సై స్వామి తెలిపారు. పెంటపాడు గేట్‌ సెంటర్‌లోని ఒక వెల్డింగ్‌ షాపు వద్ద 2021లో జరిగిన కోట్లాటలో పి.సత్తిబాబును కర్రి వీరారెడ్డి, సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తులు గాయపరిచారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో వీరారెడ్డి, సత్యనారాయణరెడ్డిలకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ పి.అన్నామణి సోమవారం తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement