అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు
తణుకు అర్బన్: దువ్వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. తణుకు సజ్జాపురం ప్రాంతానికి చెందిన నలుగురు పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగంగా దువ్వ సమీపంలోని వ్యవసాయ చెక్ పోస్టు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ విశాఖ–విజయవాడ రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది. అప్పటికే కారు నుజ్జు అయినప్పటికీ కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు రూరల్ పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులకు కారుమూరి పరామర్శ
చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అదే ప్రాంతంలో వేచి ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కారు బోల్తా పడడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్లి క్షతగాత్రులను కారులో నుంచి జాగ్రత్తగా బయటకులాగారు. కాసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు.


