దేవుని ముందే అశ్లీల నృత్యాలు
ఆగిరిపల్లి: శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం సమయంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై గ్రామ ప్రజలతో పాటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలోనే అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేయడం ద్వారా పవిత్ర రథోత్సవ గౌరవాన్ని దిగజార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం రథోత్సవం సందర్భంగా కోలాటం, సంప్రదాయ నృత్యాలు, హరికథలు ఆనవాయితీ. సోమవారం ఉదయం జరిగిన రథోత్సవంలో ఈ సంప్రదాయాలకు విరుద్ధంగా అశ్లీల నృత్యాలు వేయించడంతో భక్తులు నివ్వెరపోయారు. దేవుడి దర్శనం కోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు వేచి చూస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. ఇన్నేళ్ల చరిత్రలో ఇలా ఎప్పుడూ లేదని.. ఇది కొత్త సంప్రదాయమా.. లేక అధికార బలంతో కొత్త సంస్కృతిని తీసుకువచ్చారా అంటూ చర్చ జరుగుతోంది. నిర్వాహకులంతా అధికార పార్టీకి చెందిన టీడీపీ నాయకులే కావడంతో ఇష్టానుసారంగా వ్యవహరించారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సై శుభశేఖర్ వెంటనే రథోత్సవ ప్రాంగణానికి చేరుకుని అశ్లీల నృత్యాలు వేస్తున్న యువతులను ట్రాక్టర్‌పై నుంచి కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆలయ పరిసరాల్లో భక్తుల భావాలను దెబ్బతీసే కార్యక్రమాలు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


