ఏజెన్సీలో పులి పంజా | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో పులి పంజా

Jan 28 2026 7:13 AM | Updated on Jan 28 2026 7:13 AM

ఏజెన్

ఏజెన్సీలో పులి పంజా

గిరి పల్లెల్లో భయం.. భయం

అభయారణ్యం ఇలా..

సాక్షి ప్రతినిధి ఏలూరు: ఏజెన్సీని పెద్ద పులి వణికిస్తోంది. పులి సంచారంతో మన్యం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 10కిపైగా మూగజీవాలను చంపిన క్రమంలో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉండే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి గత వారం రోజులుగా ఈ ప్రాంత వాసులకు, ఫారెస్టు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తెలంగాణా రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల సమీపంలో ఈ నెల 21న రాత్రి సోడెం నాగేశ్వరరావు తన వ్యవసాయ భూమిలో కట్టేసిన లేగదూడ, ఆవుపై దాడి చేసి చంపింది. ఈ నెల 22న బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మగుడి మార్గం వైపు సంచరించి అక్కడ కొందరు గిరిజనులకు కనిపించి హడలెత్తించింది. అదే రోజు సాయంత్రం అంతర్వేదిగూడెం సమీపంలో ఒక ఆవు, లేగ దూడను చంపేసింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై విరుచుకుపడి వాటిని హతమార్చింది. ఆవులపై దాడి చేస్తున్న పులి ఆచూకీ కోసం ఫారెస్టు అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ ఆవులను చంపడానికి వచ్చి ట్రాప్‌ కెమెరాకు చిక్కిన పెద్దపులిని చూసి అందరూ బిత్తరపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు మీటరున్నర పొడవున్న పెద్దపులి చిత్రాన్ని చూసి అందరూ భయాందోళన చెందారు.

అదే రోజు మధ్యాహ్నం సమయానికి అంతర్వేదిగూడెం సమీపంలో కొండ ప్రాంతంలోని గాడిదబోరు వద్ద సంచరిస్తున్నట్లు ఫారెస్ట్‌ అధికారులు గుర్తించి ఆ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదె పై, కోట నాగవరంలో లేగ దూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. అక్కడ నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదుగా రాయిగూడెం వెళ్లి అక్కడ తెల్లం వెంకటేష్‌కు చెందిన దూడపై దాడి చేసింది. కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులపై పులి దాడి చేసింది.

బుట్టాయగూడెం మండలంలోని నాగులగూడెం, అంతర్వేదిగూడెం, బూరుగువాడ, కామవరం, గాడిదబోరు, గుర్రప్పగూడెం, కోటనాగవరం, కండ్రికగూడెం, రాయిగూడెం, అమ్మపాలెం తదితర గ్రామాల్లోని ప్రజలు రాత్రిపూట భయం భయంగా గడుపుతున్నారు. పగలంతా పొదల్లో, కొండ ప్రాంతాల్లో దాక్కున్న పులి రాత్రి సమయంలో గాండ్రిస్తూ గ్రామాల వెంట తిరుగుతూ ఆవుల మందపై దాడి చేయడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఆవులు, గేదెలపై దాడి చేయడంతోపాటు వారం రోజుల నుంచి ఇంకా ఈ ప్రాంతంలోనే సంచరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేసి చంపుతున్న పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించారు.

పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతో పాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం వీఆర్‌పురం, చింతూరు మండలాల పరిధిలో సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో పులులు ఉన్నట్లు వైల్డ్‌లైఫ్‌ అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా గుర్తించారు. పులులతోపాటు చిరుతలు, ఎలుగుబంటులు, అడవి దున్నలు, జింకలు, అలుగులు, తదితర జంతువులతో పాటు 250 పక్షి జాతులను గుర్తిచారు. అయితే ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడిదేనా? తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిందా? ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు.

వణుకుతున్న గిరిజన గ్రామాలు

ఖమ్మం నుంచి దారి తప్పి జిల్లాలోకి పులి ప్రవేశం?

వారం వ్యవధిలో పది మూగజీవాలను చంపిన పులి

ఏజెన్సీలో పులి పంజా 1
1/2

ఏజెన్సీలో పులి పంజా

ఏజెన్సీలో పులి పంజా 2
2/2

ఏజెన్సీలో పులి పంజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement