పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయ్‌!

Jan 28 2026 7:13 AM | Updated on Jan 28 2026 7:13 AM

పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయ్‌!

పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయ్‌!

గ్రామ, వార్డు సచివాలయాల వివరాలు

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8,743 మంది ఉద్యోగులు

ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు

సర్వేలు, యాప్‌ల నిర్వహణ వంటి పనులతో దిగాలు

పనిభారం తగ్గించాలని వినతి

ఏలూరు (టూటౌన్‌): పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనిభారం, ఒత్తిడి కారణంగా ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2025, డిసెంబరులో 13 మంది సచివాలయ ఉద్యోగులు ఆకస్మికంగా మృతి చెందితే తాజాగా 2026 జనవరిలో ఇంత వరకు ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. సచివాలయ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 75 శాఖలు ఉండగా మిగతా 74 శాఖల్లో లేని విధంగా ఒక్క సచివాలయ ఉద్యోగుల శాఖలోనే ఆకస్మిక మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా పనుల అప్పగింత

ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పక్కన బెట్టేసి కమిషన్‌ సూచించిన ప్రభుత్వ శాఖలకు కాకుండా సచివాలయాల్లోని అన్ని శాఖల ఉద్యోగులకు బీఎల్వో విధులు అప్పగిస్తున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ హ్యాండ్‌ బుక్‌ నిబంధనలను పక్కన బెట్టి సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా బీఎల్వో విధులు, వాటితో పాటు డోర్‌ టూ డోర్‌ సర్వేలు, కార్యాలయాల్లోని పనులు అప్పగిస్తున్నారు. ఫోన్లు, ఇతర సౌకర్యాలు కల్పించకుండా ఆ ఆర్థిక భారం కూడా సచివాలయ ఉద్యోగులపైనే వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సదరు ఉద్యోగి అధికారులకు టార్గెట్‌ అయిపోతున్నాడు.

మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

రాష్ట్రంలో పని ఒత్తిడితో పిట్టల్లా రాలిపోతున్న సచివాలయ ఉద్యోగుల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జాతీయ మానవ హాక్కుల సంఘానికి సచివాలయ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై జాతీయ మానవ హాక్కుల సంఘం సైతం కేసు నమోదుచేసి నెంబరు కేటాయించినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని, వారి కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కల్పించాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆదివారాలు, పండుగ సెలవుల్లో ఎలాంటి పనులు అప్పగించకూడదని, జూమ్‌ మీటింగ్‌లు వంటివి నిర్వహించకూడదని సచివాలయ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లా సచివాలయాలు ఉద్యోగులు

ఏలూరు 547 4,412

పశ్చిమగోదావరి 535 4,331

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1082 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 8,743 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 321 గ్రామ, 223 వార్డు సచివాలయాలు కలిపి మొత్తం 547 గ్రామ, వార్డు ఉండగా వీటి పరిధిలో మొత్తం 4,412 మంది పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 380 గ్రామ, 155 వార్డు సచివాలయాలు కలిపి మొత్తం 535 ఉన్నాయి. వీటి పరిధిలో 4,331 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement