
పనిచేయని లిఫ్టులు.. ఉద్యోగుల పాట్లు
నూజివీడు: ఆర్జీయూకేటీలోని అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బోధనా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా లిఫ్టులు పనిచేయకపోయినా వాటిని బాగుచేయించాలన్న ఆలోచన కూడా లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీకి, ఇతర సిబ్బందికి, అధికారులు క్యాంపస్‌లో ఉండేందుకు బహుళ అంతస్థుల క్వార్టర్స్ ఉన్నాయి. ఐదు అంతస్థులుగా ఉన్న ఈ క్వార్టర్స్‌కు లిఫ్టులు పనిచేయకపోవడంతో అందులో ఉండే సుమారు 1,500 కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి.
పనిచేయని లిఫ్టులు
ట్రిపుల్ ఐటీలో బ్యాంకు పక్కనే ఉన్న పీ1 క్వార్టర్స్ లిఫ్ట్ రెండు నెలలుగా పనిచేయడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. అలాగే ఎన్1, ఎన్3, ఎం1 క్వార్టర్స్ లిఫ్టులు నెల రోజుల నుంచి పనిచేయడం లేదు. ఎన్1 క్వార్టర్స్ లిఫ్ట్ డోర్ నాలుగైదు నిమషాలకు పడుతుండటంతో అంతసేపు వేచి ఉండలేక ఫ్యాకల్టీ కుటుంబాలు మెట్లనే ఆశ్రయిస్తున్నారు.
సరుకులు తెచ్చుకోవాలంటే నరకం
మంచినీటి టిన్నులు, బియ్యం బస్తాలు, ఇతర బరువుతో కూడిన బస్తాలు రెండో అంతస్థు దగ్గర నుంచి ఐదో అంతస్థు వరకు తీసుకెళ్లాలంటే ఆయా అంతస్థుల్లో ఉన్న కుటుంబాలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. 20 లీటర్ల టిన్నులు మోయలేక ఐదు లీటర్ల టిన్నులు కొనుక్కుంటున్నామని అంటున్నారు. కొందరు అధ్యాపకులు నాలుగైదుసార్లు ఎక్కి దిగలేక క్యాంపస్‌లోనే ఉంటూ మధ్యాహ్న భోజనం క్యారేజీని తీసుకెళ్తున్నారు. లిఫ్టులు పనిచేయకపోవడంతో పాలు పోసేవారు ఫ్లాట్ వద్దకు రావడం లేదని దీంతో కిందకు వెళ్లి పాలు తెచ్చుకుంటున్నామని అంటున్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగుల పాట్లు వర్ణనాతీతం.
నూజివీడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో నెలకొన్న దుస్థితి