
ఉపాధ్యాయులకూ పరీక్షే
● విద్యార్థి సామర్థ్యానికి మించి ప్రశ్నలు
● సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇస్తుండటంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఏ–1 పరీక్షల గురించి ఆరా తీస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..’
‘ఎఫ్‌ఏ1 పరీక్షల స్ట్రాటజీని చూసి హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల డీన్స్ సైతం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్న వైనం..’
ఇవీ ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ ఛానల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
నూజివీడు : కూటమి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల విలీనం చేసి తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకురావడమే కాకుండా క్లస్టర్ విధానంను తీసుకువచ్చి అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పరీక్షల తీరు చూస్తుంటే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలబస్‌లో చెప్పిన పాఠాలు ఒకటైతే పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలు వేరేగా ఉన్నాయని, గణితం గాని, ఇంగ్లిష్ గాని సిలబస్‌లో పాఠ్యపుస్తకంలో చెప్పిన లెక్కలు నుంచి ఒక్క ప్రశ్న కూడా ఇవ్వలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఇస్తే విద్యార్థులు ఎలా పరీక్షలు రాయగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలు చూస్తుంటే విద్యార్థులకు పెట్టినట్లు లేదని, ఉపాధ్యాయులకు పరీక్షలు అన్నట్లు ఉందని వాపోతున్నారు. ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్న ఎఫ్‌ఏ–1 పరీక్షల తీరు, ప్రశ్నాపత్రాల రూపొందించిన విధానం పరిశీలిస్తే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు రాకుండా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలహీనం చేసేందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించిన, ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ ఒకటైతే ప్రశ్నాపత్రాలలో ఇచ్చింది మరొకటి కావడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల చదివే పిల్లలు కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రశ్నలు చదివినా పరీక్షల్లో రావని చదవకుండా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వారు ఒకసారి ఆలోచించి చదివినవి, సిలబస్‌లోనుంచి ఇస్తే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చదువులు ముందుకు వెళ్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అన్ని ప్రశ్నలు కూడా అప్లికేషన్ మెథడ్‌లో ఇవ్వడం వల్ల చదివే వాళ్లు కూడా చదవకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలనేవి విద్యార్థులు నేర్చుకున్న అంశాలను, వివిధ ప్రశ్నల ద్వారా అంచనా వేసే విధంగా ఉండాలే తప్ప వారి స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని అంటున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి ఏప్రిల్ నెలలో నేర్చుకోబోయే సిలబస్‌లో ప్రశ్నలు ఆగస్టులో జరిగే యూనిట్ పరీక్షలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు విస్మయానికి గురవుతున్నారు.
పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఇలా..
ఒకటో తరగతి పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు అలవాటు అవుతున్నారు. ఇంకా కొందరు పాఠశాలకు రావడానికి మొరాయిస్తున్నారు. వీరు ఇప్పుడిప్పుడే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలను గుర్తు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఇంగ్లిష్‌లో పేరాగ్రాఫ్ ఇచ్చి దానిని విని ఇంగ్లిష్‌లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పదాలు తయారు చేయడం చేయాలి. అలాగే మూడో తరగతి విద్యార్థి తెలుగులో పుస్తక సమీక్ష చేసి, ఆ సమీక్షను సమర్పణ చేయాలి. అలా చేసినప్పుడే వాటికి మార్కులు ఇవ్వాలి. మూడో తరగతి ఆంగ్ల భాష పరీక్షకు నాలుగో తరగతిలోని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. ఎస్‌సీఈఆర్టీలో ప్రశ్నాపత్రాలు రూపొందించే వారికి విద్యార్థి స్థాయి, సామర్థ్యంపై కనీస అవగాహన ఉండటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలు దేనికి ఉపయోగమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.