
ద్వారకాతిరుమలలో లారీ బీభత్సం
● రెండు కార్లను, ఒక ఆటోను ఢీకొట్టిన లారీ
● ఆటో డ్రైవర్‌కు గాయాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం తెల్లవారుజామున ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. గుడి సెంటర్‌లో రెండు కార్లను, గరుడాళ్వార్ సెంటర్‌లో రోడ్డు మధ్యలోని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లి ఒక టాటా ఏస్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరిగాయి. పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామానికి చెందిన మాతంగి వెంకటేష్ తన ఆటోలో పెళ్లి బృందాన్ని క్షేత్రానికి తీసుకొచ్చాడు. వారిని కల్యాణ మండపం వద్ద దింపిన తరువాత గరుడాళ్వార్ సెంటర్‌లోని దేవస్థానం బస్‌స్టేషన్ వద్ద ఆటోను నిలిపి, అందులో నిద్రిస్తున్నాడు. అలాగే మచిలీపట్నం, విశాఖపట్నంకు చెందిన పెళ్లి బృందాలు వేసుకొచ్చిన రెండు కార్లను గుడి సెంటర్‌లో నిలిపి, కల్యాణ మండపాల్లోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో చింతలపూడి నుంచి కాకినాడకు వెళుతున్న ఒక లారీ గుడి సెంటర్‌లో నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిన లారీ గరుడాళ్వార్ సెంటర్ వద్ద డివైడర్‌పైకి దూసుకెళ్లి రోడ్డుకు అవతల వైపు దేవస్థానం బస్ షెల్టర్ వద్ద నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆటో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం కాస్తా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ వెంకటేష్‌కు గాయాలయ్యాయి. అలాగే రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు గుర్తించారు.
వర్షం వల్ల తప్పిన పెను ప్రమాదం..
క్షేత్రంలో వివాహాలు జరిగే ప్రతిసారి రహదారులు పెళ్లి జనాలతో రద్దీగా ఉంటాయి. అయితే బుధవారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో పెళ్లివారు ఎవరూ రోడ్లపైకి రాలేదు. దాంతో ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. గురువారం ఉదయం విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ చెరుకూరి లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.