
సత్యనారాయణపురంలో చోరీ
ఆకివీడు: మండలంలోని పెదకాపవరం శివారు సత్యనారాయణపురం గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామంలోని ఇందుకూరి సూర్యనారాయణరాజు బుధవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి పిప్పర గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం బద్దలుకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు తెరిచి ఉండడం, సుమారు రూ.1.60 లక్షల విలువైన ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు టౌన్: టిప్‌టాప్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న ఓ యువకుడిపై గోడ కూలిపోవటంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏలూరు నగరానికి చెందిన కోన సాయి (22) బాలబాలాజీ అనే టిప్‌టాప్ కంపెనీలో టెంట్లు వేసే కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తంగెళ్ళమూడి ప్రాంతంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కోసం బుధవారం టెంట్లు వేశారు. అనంతరం గురువారం టెంట్లు తొలగించేందుకు సాయి అక్కడికి వెళ్లాడు. బుధవారం రాత్రి భారీ వర్షంతో గోడలు పూర్తిగా నానిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెంట్లు తీస్తూ ఉండగా ఆకస్మికంగా గోడ అతనిపై కూలిపోవడంతో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.