
ఏలూరు జిల్లాలో కుండపోత
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిడమర్రు మండలంలో 95 మి.మీ వర్షపాతం నమోదు కాగా ద్వారకాతిరుమల మండలంలో 68.2, ఉంగుటూరు మండలంలో 65.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరులో 26.6, ఏలూరు రూరల్ మండలంలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 723.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ మరో 200 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరులో భారీ వర్షానికి ఆర్‌ఆర్‌పేటలో రోడ్లు నీట మునిగాయి. అశోక్‌నగర్, పత్తేబాద, ఎన్‌ఆర్‌పేట, పవర్‌పేట, కొత్తపేట, 12 పంపుల సెంటర్, బీడీ కాలనీ, ఇజ్రాయేల్‌పేట, తంగెళ్ళమూడి ఏరియాలతోపాటు ఏలూరు వన్‌టౌన్ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోతుంది. ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, శ్రీరామ్‌నగర్, శనివారపుపేట, పోణంగి రోడ్డు, వైఎస్సార్ కాలనీ ప్రాంతంలోనూ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏలూరు కలెక్టరేట్‌లో 18002331077, 9491041419 నెంబర్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అనితకు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
విద్యుత్ సిబ్బంది అప్రమత్తం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అల్పపీడనం నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్‌రాజు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్‌ఆర్‌పేటలోని జిల్లా విద్యుత్ సంస్థ కార్యాలయంలో 9440902926 నెంబర్‌తో, జంగారెడ్డిగూడెం ఆఫీస్‌లో 9491030712 నెంబర్‌తో 24 గంటలూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా విద్యుత్ అంతరాయం తలెత్తితే దగ్గరలోని విద్యుత్ సెక్షన్ ఆఫీసుకు గానీ, టోల్ ఫ్రీ నెంబరు 1912కు, కంట్రోల్ రూమ్ నెంబర్లకు గానీ ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తారన్నారు.
స్తంభించిన జనజీవనం
జిల్లా వ్యాప్తంగా 723.2 మి.మీ వర్షపాతం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

ఏలూరు జిల్లాలో కుండపోత