
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఏలూరు (మెట్రో): జిల్లా లో వైద్యులు, సిబ్బంది కారణంగా మాతా, శిశు మరణాలు సంభవిస్తే, సదరు వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా మాతా, శిశు మరణాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల సమయంలో జిల్లాలో సంభవించిన మాతా, శిశు మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు నెలల కాలంలో జిల్లాలో 3 మాతా మరణాలు, 54 శిశు మరణాలు సంభవించాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
మూల్యాంకన విధానంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి
నూజివీడు: పాఠశాలల్లో కొత్తగా తీసుకొచ్చిన మూల్యాంకన పుస్తక విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్‌జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకనం పుస్తకాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి నాలుగు నుంచి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇచ్చారన్నారు. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులు రాయాలని, పరీక్షలు రాసిన తర్వాత వాటిని దిద్ది అందులోనే ఉన్న ఓఎమ్మార్ షీట్లలో మార్కులు వేయడంతో పాటు ఓఎమ్మార్ షీటు విద్యాశాఖ ఇచ్చిన యాప్‌లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మూల్యాంకన పుస్తకాలు ఇచ్చి అదనపు భారం మోపడం సరికాదన్నారు.