
యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: యోగాసన పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 10న ఏలూరులోని ప్రేమాలయ ఓల్డేజ్ హోంలో జరిగిన ఈ పోటీలో 14 మంది విద్యార్థులు వేర్వేరు ఆసనాలలో 16 పతకాలను సాధించారు. 9 మంది గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్, ఒకరు బ్రాంజ్ మెడల్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో తనూష, హరిత, దివాకర్‌లు గోల్డ్ మెడల్స్ సాధించగా, సీనియర్స్ విభాగంలో అశోక్, అభిషేక్, దీపక్ నాయుడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హరిత, అశోక్, దీపక్ నాయుడులు యోగాసనాలలోని వివిధ ఈవెంట్లలో రెండేసి చొప్పున గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో దేవిశ్రీ, స్పందన, ప్రమీల, వెంకటలక్ష్మి, యుగంధర్, దామోదర్‌లు సిల్వర్ మెడల్స్ సాధించగా, గీతిక అనే విద్యార్థిని బ్రాంజ్ మెడల్ సాధించింది. యోగాసనాలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ చిరంజీవి, అకడమిక్ అసోసియేట్ డీన్ రఘు, యోగా టీచర్ పి. చంద్రశేఖర్ లు అభినందించారు.
అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
పెదపాడు: మండలంలోని అప్పనవీడులోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం 10,32,522 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మండలంలోని మొండూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. 76 రోజులకు ఈ లెక్కింపు చేసినట్లు తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
ద్వారకాతిరుమల: మండలంలోని దొరసానిపాడు శివారులోని ఒక పామాయిల్ తోటలో నిర్వహిస్తున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. పేకాట జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలసి స్థావరంపై దాడి చేశారు. ఆ సమయంలో కొందరు పేకాటరాయుళ్లు కార్లలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి ద్వారకాతిరుమలలోని కొత్త బస్టాండు వద్ద పట్టుకున్నారు. మొత్తం 14 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 1.23 లక్షల నగదు, 4 కార్లు, 15 సెల్‌ఫోన్లతో పాటు, నగదుకు బదులుగా వినియోగిస్తున్న రెండు రకాల 93 కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా విజయవాడకు చెందిన వారుగా చెబుతున్నారు. స్థానికంగా వారికి సహకరించి, పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఎవరన్నది తెలియరాలేదు. రాత్రి 10.30 గంటలైనా దీనికి సంబంధించిన సమాచారం పోలీసులు ఇవ్వలేదు.

యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ