
విద్యుత్ శాఖలో సిఫార్సు బదిలీలలు!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో త్వరలే జరిగే పదోన్నతులు, బదిలీలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉండటంతో వారు పనిచేసే స్థానాలను ఆశిస్తూ ఇప్పటికే కొందరు అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సమర్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వ్యూహాత్మకంగా పావులు
ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజుకు రానున్న జనవరిలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి లభించనుంది. దీంతో ఈ పోస్టు ఖాళీ కానుంది. అలాగే భీమవరం సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.ఝాన్సీకి ఇప్పటికే ఎస్‌ఈగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే కొన్ని సమీకరణాల కారణంగా ఆమె స్వయంగా పదోన్నతిని వాయిదా వేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. భీమవరం ఎస్‌ఈ ఎ.రఘునాథబాబు ఈనెల 24 వరకూ సెలవు పెట్టారు. దీంతో ఈ స్థానానికి ఏలూరు ఎస్‌ఈని ఇన్‌చార్జిగా నియమిస్తూ సీఎండీ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఏలూరు ఎస్‌ఈ సాల్మన్ రాజు ఏలూరు స్థానానికి వచ్చి మూడేళ్లు ముగుస్తున్నందున ఆయన్ను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. దీంతో ఆయనకు తొలుత భీమవరం సర్కిల్‌కు ఎఫ్‌ఏసీగా బాధ్యతలు ఇచ్చి, అనంతరం భీమవరం స్థానాన్ని కేటాయించడానికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సీఎండీకి సిఫార్సు లేఖలు
ఏలూరు ఎస్‌ఈ స్థానం ఖాళీ అయితే భీమవరం సర్కిల్ ఈఈ (టెక్నికల్) ఝాన్సీని అక్కడికి బదిలీ చేస్తారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆమె స్థానంలోకి (భీమవరం) కాకినాడ జిల్లా జగ్గంపేటలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఎస్‌ఈ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి సైతం ఏలూరు ఎస్‌ఈ స్థానానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయన గతంలో ఏలూరు సర్కిల్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసినందున సర్కిల్‌పై పట్టు ఉండటంతో కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఇక్కడ నియమించాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది. అలాగే భీమవరం టౌన్ ఏఈఈగా పనిచేస్తున్న అధికారికి ఈఈ గా పదోన్నతి కల్పించి ఆయన్ను జగ్గంపేట ఈఈగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు కూటమి ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను కూ డా సీఎండీకి పంపినట్టు చర్చించుకుంటున్నారు.
వేధింపులతో..
కూటమి ఎమ్మెల్యేల వేధింపులతో ఓ అధికారి బలి అవుతున్నాడనే చర్చ ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. వారం క్రితం టెలీ కాన్ఫరెన్స్‌లో భీమవరం ఎస్‌ఈ రఘునాథబాబు పనితీరుపై సీఎండీ అందరి ముందు మందలించడంతో ఆయన కినుక వహించి సెలవు పెట్టారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు భీమవరం సర్కిల్‌లో అధిక శాతం ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులే పనిచేస్తుండటం, వారంతా రఘునాథబాబుపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని అంటున్నారు. వీటిని భరించలేక ఆయన సీఎండీ కార్యాలయంలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
బదిలీలు, పదోన్నతులపై చర్చ
ఇప్పటికే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలంటూ గుసగుసలు
వేధింపులు భరించలేక భీమవరం ఎస్‌ఈ వీఆర్‌ఎస్‌కు దరఖాసు ్త!