
అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)కు సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి త్వరితగతిన పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భాగంగా అధికారులతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 268 అర్జీలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదన్నారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం. అచ్యుత అంబరీష్, ఎస్‌డీసీ కె.భాస్కర్, జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● చింతలపూడి మండలం యండపల్లికి చెందిన దాసరి సురేష్‌కుమార్ బంగారు కుటుంబానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ నెలకొల్పి మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆశయం ఉందని మంచి మార్గదర్శిని సూచించాలని కోరారు.
● ద్వారకాతిరుమండలం పి.కన్నాపురానికి చెందిన పిండి ఎలీషా తన పంట భూమికి 1బీ–అడంగల్‌లో నమోదు చేసి పట్టాదారు పాసుబుక్ ఇప్పించాలని కోరారు.
● దెందులూరు మండలం కొవ్వలికి చెందిన వడ్లపట్ల వెంకటేశ్వరరావు తమ నివాసాలకు పక్కన బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు.
● కామవరపుకోటకు చెందిన వానరాశి లక్ష్మీరాజ్యం తన పంట పొలంలోకి వెళ్లే రోడ్డు ఆక్రమణకు గురైందని, తొలగించి దారి చూపాలని వినతిపత్రం అందజేశారు.
రూ.5.72 కోట్లతో హాస్టళ్ల అభివృద్ధి
జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో చేపట్టిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను ఆగస్టు నెలాఖరులోపు పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో రూ.5.72 కోట్లతో వివిధ ప్రాంతాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి ఐదు ఇంజనీరింగ్ శాఖలకు పనులు అప్పగించామన్నారు.