
కూర్మ విలాపం
కై కలూరు: తాబేళ్ల అక్రమ రవాణాకు కొల్లేరు ప్రాంతం కేంద్రంగా మారింది. పర్యావరణానికి వెలకట్టలేని మేలు చేస్తున్న నల్లచిప్ప తాబేళ్లను కాసులకు కక్కుర్తిపడి రాత్రి సమయంలో సరహద్దులు దాటించేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో తాబేలు మాంసానికి మంచి గిరాకీ ఉండటంతో అడ్డదారుల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలించి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాబేళ్ల స్మగ్లర్ కుమార్ రెండేళ్లుగా ఒడిశాలో ఉంటూ కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చే తాబేళ్లను మార్కెట్ చేస్తున్నాడు. అతనిపై తాబేళ్ల అక్రమ రవాణాలో పలు కేసులున్నాయి.
అక్రమ రవాణా ఇలా..
ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చేపల పట్టుబడుల వలలో తాబేళ్లు చిక్కుకుంటాయి. వలల మేసీ్త్ర సమాచారంతో కొందరు వీటిని సేకరిస్తున్నారు. ఎక్కువ మంది కొల్లేరు డ్రెయిన్లు, పంట బోదెలలో వీటిని పట్టుకుంటున్నారు. ఏజంట్లు సేకరించిన తాబేళ్ళను గోనె సంచులు, నీటి డ్రమ్ములలో దాస్తున్నారు. సేకరించిన వీటిని సైజును బట్టి కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు ఇక్కడ కొనుగోలు చేసి ఒడిశాలో కేజీ రూ.300పైగా విక్రయిస్తోన్నారు. ఉదాహరణకు వాహనంలో సుమారు 5 టన్నుల తాబేళ్లు రవాణా చేస్తే రూ.15 లక్షలు ముడుతోంది. అన్ని ఖర్చులు పోయి అక్రమార్కులకు మినిమం రూ.10 లక్షల వరకు మిగులుతోంది. దీంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
కేంద్ర బిందువుగా భీమవరం
ఆక్వా హబ్‌గా పేరొందిన భీమవరం అక్రమ తాబేళ్లకు స్టాకింగ్ పాయింట్‌గా మారింది. కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో సేకరించిన తాబేళ్లను కోరుకొల్లు, కలిదిండి, కాళ్ళ మీదుగా భీమవరం తరలిస్తున్నారు. అక్కడ నుంచి పెద్ద వాహనాల్లో ఒడిశా చేర్చుతున్నారు. కొల్లేరు ప్రాంతం నుంచి బొలోరో వాహనాల్లో అడుగున తాబేళ్లను పరిచి పైన చేప గురక పిల్లలను ఉంచుతున్నారు. ఎవరైన చెకింగ్‌కు వస్తే చేపలు కనిపిస్తాయి. అడుగున తాబేళ్లను గుర్తించలేకపోతున్నారు. మండవల్లి మండలం కొవ్వాడలంక, కలిదిండి మండలం బొబ్బిలిగూడెంకు చెందిన ఇద్దరు గతంలో తాబేళ్ళ రవాణాలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో కలిదిండి, వెంకటాపురం, ఏలూరు రోడ్, ముదినేపల్లి ప్రాంతాల్లో అటవీ, పోలీసు అధికారులు అక్రమ తాబేళ్ల రవాణాను పలుమార్లు అడ్డుకున్నారు.
కొల్లేరు చుట్టూ తాబేళ్ల అక్రమ రవాణా
అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేళ్లు
గుట్టుచప్పుడు కాకుండా ఒడిశాకు తరలింపు
అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేలు
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) 2002లోనే అంతరించిపోతున్నా జాతులలో నల్లచిప్ప తాబేలును చేర్చింది. ఇండియాలో అసోం, త్రిపుర, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి 31 అంగుళాల వెడల్పు, 28 అంగుళాల పొడవు పెరుగుతాయి. సాధారణంగా 38 గుడ్లు పెడతాయి. మొక్కలు, చేపలు, పురుగులతో పాటు నీటిలో హనికర క్రిములను తింటాయి.
అంతరించిపోతున్న తాబేలు జాతిని అన్ని దేశాలు షెడ్యూల్ –1 కేటగిరిలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేలును వేటాడడం, రవాణా చేయడం నేరం. ఏడేళ్లు కారగార శిక్ష విధించవచ్చు. అటవీ శాఖ చట్టాల సెక్షన్లు 27, 29, 31బీల ప్రకారం కేసులు నమోదు చేయొచ్చు.
నిఘా ముమ్మరం చేశాం
తాబేళ్ళ రవాణా నేరం. కొల్లేరు పరివాహక ప్రాంతాలు కాకుండా బయట ప్రాంతాల్లో వీటి రవాణా జరిగితే టెరిటోరియల్ ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేస్తారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో రవాణా చేస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి – కేపీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు

కూర్మ విలాపం

కూర్మ విలాపం