
దోమ తెరలు ఎక్కడ?
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్య ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడంలేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణలో కీలకమైన దోమ తెరల పంపిణీని గతేడాది గాలికి వదిలేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుందనే విమర్శలు విల్లువెత్తుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు నాటికి కేవలం 93 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 10 నాటికి సుమారు 570 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 477 కేసులు అధికంగా నమోదయ్యాయి. గిరిజన గ్రామాల్లో దోమల నివారణకు ప్రస్తుతం మూడో దశలో మలాథియన్ స్పేయింగ్ పనులు జరుగుతున్నటు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మలేరియా కేసులు అధికంగా పెరుగుతునే ఉన్నాయి. దోమలను నివారించాలంటే దోమ తెరలతోనే సాధ్యమని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో దోమతెరల పంపిణీ
పశ్చిమ ఏజెన్పీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసింది. గ్రామాల్లో దోమలను అరికట్టేందుకు అధికారులు పగడ్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి మఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ (ఎన్‌విబీడీసీపీ) నుంచి సుమారు 2 లక్షల 50 వేల దోమ తెరలను రప్పించి బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమ తెరల కాలపరిమితి మూడేళ్ల లోపు కావడంతో మళ్లీ 2024 జనవరిలో దోమ తెరల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపింది.
కానరాని దోమ తెరల పంపిణీ
కూటమి ప్రభుత్వం దోమ తెరల పంపిణీపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గత ఏడాది దోమ తెరల పంపిణీ జరగలేదు. ఈ ఏడాది వేసవిలో వర్షాలు కురవడం, వర్షా కాలంలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సీజనల్ జర్వాలతో పాటు మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికై న ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేసి మలేరియా జ్వరాల నివారణకు కృషి చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
మన్యంలో విజృంభిస్తున్న మలేరియా జ్వరాలు
గతేడాది కంటే అధికంగా పెరుగుతున్న కేసులు
మొక్కుబడిగా నియంత్రణ చర్యలు
గత ఏడాది నుంచి పంపిణీ చేయని దోమ తెరలు
జిల్లాలో మలేరియా
సమసాత్మక గ్రామాలు – 153
బుట్టాయగూడెం, పోలవరం,
జీలుగుమిల్లి మండలాల్లో – 117
వీలీన మండలాలైన కుక్కునూరు,
వేలేరుపాగు మండలాల్లో – 36 గ్రామాలు