
గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.
మద్దిలో హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో ఆర్‌వీ చందన మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో ఈ హోమం ప్రతీ ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం నిర్ణయించిందన్నారు. హోమ కార్యక్రమం పర్యవేక్షణ ఆలయ పర్యవేక్షకుడు జవ్వాది కృష్ణ నిర్వహిస్తారని ఈవో తెలిపారు.
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు, పొంగళ్లు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చుకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున మొత్తం రూ.38,9085 ఆదాయం వచ్చిందని చెప్పారు.

గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు

గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు

గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు