
వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
తణుకు అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రచార బోర్డును ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరగవరం కాలనీ శివారు ప్రాంతంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన కత్తుల చక్రధరరావు అలియాస్ చక్రి (32) ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటూ 20 రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. తూర్పు విప్పర్రులోని అత్తవారింటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇరగరం రోడ్డులో వాహనం అదుపుతప్పి బోర్డును ఢీకొట్టగా తలకు తీవ్రగాయమై ఘటనా ప్రాంతంలోనే కన్నుమూశాడు.
బంగారు ఆభరణాల చోరీ
ఆకివీడు: ఇంట్లో దొంగలు చొరబడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ఘటన కాకరపర్తి చెంచయ్య వీధిలో జరిగింది. ఈ నెల 7న ఉదయం ఇంటికి తాళం వేసి నర్సాపురంలో వివాహ వేడుకకు విశ్రాంతి ఉపాధ్యాయుడు పులవర్తి వెంకటేశ్వరరావు కుటుంబం వెళ్లింది. ఆదివారం తిరిగి వచ్చే సరికి తాళాలు బద్ధలుకొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ జగదీశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 9 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని ఏఎస్‌ఐ బీ.సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
తణుకు అర్బన్: తణుకు పైడిపర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కిందపడి తీవ్రగాయాలపాలైన తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ రవి (50) శనివారం రాత్రి రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తణుకు కోర్టులో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న రవి ఈనెల 9వ తేదీన ఉదయం పైడిపర్రు ప్రాంతంలో ఏలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాలు నుజ్జునుజ్జయ్యింది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచానామా అనంతరం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో చోరీ
జంగారెడ్డిగూడెం: పట్టణంలో గుండాబత్తుల వారి వీధిలో ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న డి.శిరీష ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 8న ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన టి.నరసాపురం మండలం ప్రకాశ్‌నగర్ వెళ్లింది. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలకొట్టి ఉన్నాయి. అల్మరాలో ఉంచిన బంగారం ఉగరం, రూ.3 వేల నగదు చోరీకి గురయ్యాయి.
వృద్ధుడి ఆత్మహత్య
ఏలూరు టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ రంగారావు కాలనీకి చెందిన పిల్లా తాతారావు (67) రెండేళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు.