
వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయానికి తీవ్ర నష్టం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఏలూరులో నిర్వహించే క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ పాల్గొన్నారు.