
సుందరగిరి.. ఆధ్యాత్మిక ఝరి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్ర దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురంలో సుమనోహర సుందరిగిరిపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో తొలిసారిగా దివ్య పవిత్రోత్సవాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 19 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు స్వామివారి వైభవాన్ని చాటనున్నాయి. పురాణ ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని దర్శిస్తే కో రిన కోర్కెలు తీరి, సకల శుభాలు కలుగుతాయ న్నది భక్తుల నమ్మకం. ఏకాదశి, పర్వదినాల్లో వేలాదిగా భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. చినవెంకన్న దేవస్థానం ఏటా స్వామివారి దివ్య కల్యాణోత్సవాలను నిర్వహిస్తోంది. ఏటా శివరాత్రి నాడు హైదరాబాద్‌కు చెందిన కొచ్చెర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ స్వామివారి కీర్తిని చాటుతున్నారు.
పవిత్సోవాలు ఇలా..
● 19న ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమాలు వంటి పూజాదికాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, మూలమంత్ర హోమాలు, బలిహరణ, శేషవాహన సేవ లు జరుగనున్నాయి.
● 20న మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, అభిషేకాలు, పవిత్రారోపణ, గరుడ వాహన సేవలు జరుగుతాయి.
● 21న మహాశాంతి పౌష్ఠిక హోమాలు, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, శాంతి కల్యాణం, ఆశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవు తాయి.
మతంగి మహర్షి తపోఫలంతో..
మతంగి మహర్షి తపోఫలంతో సుందరగిపై నారసింహుడు స్వయంభూగా శాలిగ్రామ రూపంలో వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ మతంగి మహర్షి సర్ప రూపంలో స్వామి వారిని నిత్యం సేవిస్తారని ప్రసిద్ధి. ఆలయం వెనుక ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పుట్టే ఇందుకు సాక్ష్యమని పండితులు చెబుతున్నారు. దాదాపు వందేళ్ల క్రితం ఠాణేదారు అయిన ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చర్లకోట రామారావు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన గూడూరు అయ్యన్న, బెల్లన్న అరణ్య ప్రాంతమైన ఈ మార్గం మీదుగా వెళుతుండగా కొండపై సాలిగ్రామ రూపంలో ఉన్న స్వామిని గుర్తించి పాల పొంగలి చేసి నివేదించారు. ఇలా నారసింహుని ఉనికి తెలిసింది.
తొలిసారిగా నారసింహుని పవిత్రోత్సవాలు
ఐఎస్ జగన్నాథపురంలో 19 నుంచి వేడుకలు

సుందరగిరి.. ఆధ్యాత్మిక ఝరి