
నేత్రపర్వంగా పవిత్రారోహణ
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం పవిత్రారోహణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో గత రెండు రోజులుగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం ఆలయ యాగశాలలో హోమగుండం వద్ద అగ్ని ఆరాధన, చతుర్ధ కలశ స్నపనను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఘనంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అలంకరణలు చేసే పవిత్రాలను అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు స్వామివారి వాహనాన్ని భక్తి ప్రపత్తులతో మోశారు. ఆ తరువాత ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీవారి మూలవిరాట్‌కు, అమ్మవార్లకు అలాగే ఉత్సవమూర్తులకు అర్చకులు పవిత్రాలను ధరింపజేశారు. అనంతరం పవిత్రాంగ హోమం, శాంతి హోమాన్ని భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆదివారం జరిగే పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి వేడుకలతో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణమూర్తి తెలిపారు. సోమవారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు.