
మున్సిపల్ సిబ్బంది టూల్స్ డౌన్
ఏలూరు(టూటౌన్): క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిరక్షణలో వహిస్తున్న నిర్లక్ష్య విధానాలకు వ్యతిరేకంగా ఏలూరులో శనివారం నాడు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగ సిబ్బంది టూల్స్ డౌన్ కార్యక్రమాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్‌లను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 11వ పీఆర్సీలో పెండింగ్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): తమ్మిలేరు భూములను ఆక్రమించుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ్ణ డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తమ్ములేరు భూములు అన్యాక్రాంతమవుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. శనివారం ఏలూరు రూరల్ మండలం చోదిమెళ్ళలో ఎఫ్‌సీఐ గోడౌన్స్ వద్ద తమ్మిలేరు భూమిని కొంతమంది ఇనుప కంచెలు వేసి దున్ని ఆక్రమించుకున్నారన్నారు. వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.