
శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు
ద్వారకాతిరుమల : శ్రీవారి కొండపై సామాన్య భక్తులే టార్గెట్‌గా వారు వేసుకొచ్చే ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుమును రెట్టింపు వసూలు చేస్తున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ తెలియనట్టు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైకి వివిధ వాహనాలపై వెళ్లే భక్తుల నుంచి టోల్ రుసుమును రెండేళ్ల పాటు వసూలు చేసుకునే హక్కుకు గతేడాది జూలైలో దేవస్థానం బహిరంగ వేలాన్ని నిర్వహించింది. పాట దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం తొలి ఏడాది సుమారు రూ. కోటి 60 లక్షలను దేవస్థానానికి చెల్లించాడు. ఈనెల 1 నుంచి రెండో ఏడాది మొదలైంది. ఈ సంవత్సరం జీఎస్టీతో కలిపి సుమారు రూ. కోటి 80 లక్షలను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కొంత సొమ్మును మాత్రమే జమ చేశారు. ఇదిలా ఉంటే ద్విచక్ర వాహనానికి రూ.10 వసూలు చేయాల్సిన కాంట్రాక్టర్, డబుల్ రుసుముగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదేం దారుణమంటూ ద్విచక్ర వాహనాలపై వస్తున్న భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.
దేవస్థానం నిర్ణయించిన ధరలు ఇవీ
దేవస్థానం నిర్ణయించిన ధరల ప్రకారం లారీ, బస్సు, ఇతర భారీ వాహనానికి రూ.150, మినీ బస్సు, (407) వ్యాన్ స్వరాజ్, మజ్ధూర్ వాహనానికి రూ.100, ట్రాక్టరు (ట్రక్కుతో), ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్, ట్రాక్టర్ ఇంజన్, కారు, జీపు, వ్యాన్‌కి రూ.50, పాసింజర్ ఆటోకి రూ. 25, స్కూటర్, మోటర్ సైకిల్‌కి రూ.10 వసూలు చేయాలి. అయితే సామాన్య భక్తులు వచ్చే ద్విచక్ర వాహనాలకు దేవస్థానం నిర్ణయించిన ధరకంటే రెట్టింపు ధరను వసూలు చేస్తూ, భక్తులను దోచేస్తున్నారు.
ధరల బోర్డుకు మొక్కలు అడ్డుపెట్టి మరీ
భక్తులకు వాహనాల టోల్ రుసుములు కనిపించకుండా తెలివిగా టోల్‌గేటు వద్ద ఉన్న ధరల బోర్డుకు మొక్కలు అడ్డుపెట్టి మరీ ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు గానీ, శనివారం శ్రీవారికి ప్రీతికరమైనరోజు, రాఖీ పండుగ, క్షేత్రంలో అధికంగా వివాహాలు జరగడంతో వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన భక్తుల నుంచి ఈ రెట్టింపు రుసుములను వసూలు చేశారు. దీనిపై సంబంధిత సెక్షన్ ఏఈఓ రమణరాజును వివరణ కోరగా టోల్ రుసుములు అధికంగా వసూలు చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విచారించి తగు చర్యలు చేపడతామన్నారు.
సామాన్య భక్తులే టార్గెట్‌గా దోపిడీ
ద్విచక్ర వాహనాలకు రెట్టింపు రుసుం వసూలు
చోద్యం చూస్తున్న అధికారులు.. ముక్కున వేలేసుకుంటున్న భక్తులు
రూ.20 తీసుకున్నారు
ఫ్యామిలీతో బైక్‌పై వచ్చాను. కొండపైన టోల్‌గేటు వద్ద రూ.20 వసూలు చేశారు. గతంలో వచ్చినప్పుడు రూ.10 తీసుకున్నారు. ధరలు పెంచారని అనుకున్నాను. తీరా కొండపైకి వచ్చిన తరువాత టోల్ నిర్వాహకులు రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని తెలిసింది.
– అంగిరేకుల రమేష్, భక్తుడు, రాట్నాలకుంట, పెదవేగి మండలం
అధికారులు ఏం చేస్తున్నారు
దూరాన్ని సైతం లెక్కచేయకుండా ద్విచక్ర వాహనాలపై క్షేత్రానికి వచ్చేది సామాన్య భక్తులే. అటువంటి సామాన్య భక్తులను దోచేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ఇదంతా వారికి తెలియకుండానే జరుగుతుందా.? మరీ ఇంత దారుణమా.
– చీకటి విజయభాస్కర్, నాగుపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అడుగుదామంటే..
తరచూ నేను టీవీఎస్ మోపెడ్‌పై శ్రీవారి క్షేత్రానికి వస్తుంటాను. గతంలో టోల్ రుసుము రూ.10 మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు రూ.20 తీసుకున్నారు. ఇదేంటని అడుగుదామంటే వెనుక వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ముందుకెళ్లిపోయాను.
– గురజాల ధర్మారావు, నీలాద్రిపురం, ఉంగుటూరు మండలం

శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు

శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు

శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు

శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు

శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు