
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
తణుకు అర్బన్: ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ రవి ద్విచక్ర వాహనంపై తణుకువైపు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి వచ్చేసరికి ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి కాలు నుజ్జయిపోవడంతో మొదట తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి, మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లుగా తెలిసింది. బాధితుడు తణుకు కోర్టులో ప్లీడరు గుమస్తాగా విధులు నిర్వర్తిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్నేహితుడిపై కత్తితో దాడి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్నేహితుడిపై ఓ వ్యకి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ మండలం హనుమాన్ నగర్‌కు చెందిన కృష్ణవరపు ఆంజనేయ వరప్రసాద్ స్థానికంగా కారు డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పేరాడ శివాజీ ఇతనికి చిన్ననాటి నుంచి స్నేహితుడు. శనివారం వీరిద్దరి మధ్య చిన్న విషయంపై మాటమాట పెరిగింది. దీంతో ఆంజనేయ వరప్రసాద్‌పై శివాజీ కత్తితో దాడి చేశాడు. గమనించిన ప్రసాద్ బంధువులు వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రసాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.