
ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడుతున్న శ్లాబ్
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో శ్లాబ్ భాగం నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. పాత బిల్డింగ్‌లో రెండో అంతస్తులోని వార్డుల సమీపంలో శ్లాబ్ పెద్దపెద్ద పెచ్చులు ఊడి పడుతుండటంతో రోగులు, నర్సులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరి నెత్తిన పెచ్చులు పడతాయేమోనని బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, పెచ్చులు ఊడుతున్న చోట కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా వదిలేశారని రోగులు, ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు.
11 నుంచి జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని అండర్–22 విభాగంలో మహిళలు, పురుషులకు 10 క్రీడాంశాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 13 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. 11 తేదీన జంగారెడ్డిగూడెంలో ఆర్చరీ, ఏలూరు భిశ్వనాధ్ భర్తియా స్విమ్మింగ్‌పూల్‌లో స్విమ్మింగ్, సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బ్యాడ్మింటన్, ఖండ్రికగూడెం బాక్సింగ్ ఆకాడమీలో బాక్సింగ్ పోటీలు, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బాస్కెట్‌బాల్, హాకీ, కబడ్డీ ఖొఖో, వాలీబాల్ పోటీలు, ఇండోర్ స్టేడియంలో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు చేపడతామని వెల్లడించారు. తిరిగి 13న ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియంలో అథ్లెటిక్స్ నిర్వహిస్తామని వివరించారు. వివరాలకు 98663 17326 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.