సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి కూటమిలో సొసైటీల వార్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు అడపాదడపా అసంతృప్తులు, వెంటనే సర్ధుబాటులతో కొనసాగిన టీడీపీ, జనసేన కాపురం రచ్చకెక్కింది. పదవుల పంపకాల్లో ప్రాధాన్యతలపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. నియోజకవర్గంలో 20 సొసైటీలుంటే ముష్టివేసినట్లు రెండు సొసైటీలే జనసేనకు కేటాయించడంపై జనసేన ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఇదే క్రమంలో జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ పట్టుపట్టి 50 శాతం వరకు పదవులు దక్కించుకుంది. టీడీపీ నియోజకవర్గాల్లో మాత్రం జనసేనకు పట్టుమని 10 శాతం కూడా కేటాయించకపోవడంపై జనసేనలో కలకలం రేగుతుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో పోలవరం, ఉంగుటూరు జనసేనకు, కై కలూరు బీజేపీకి కేటాయించారు. ఆయా పార్టీలకు మద్ధతు ఇవ్వడంతో పాటు ప్రచారం నిర్వహించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్లు, దేవాలయాల పాలక మండలి, సొసైటీ చైర్మన్లు, ఇతర స్థానిక నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీలు పంచుకోవాలని నిర్ణయించారు. జనసేన నేత జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పదవుల పంపకాల విషయంలో గతంలో జిల్లాలో సెటిల్‌మెంట్ తరహాలో సమావేశం పెట్టారు. ఉదాహరణకు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో 50 శాతానికిపైగా పదవులు టీడీపీ ఎమ్మెల్యే తీసుకోవడం, మిగిలిన 50 శాతం జనసేన, బీజేపీ కలిపి పంచుకోవాలనేది పెద్దల నిర్ణయం. కట్‌చేస్తే.. టీడీపీ మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 90 శాతానికిపైగా పదవులు టీడీపీకే కేటాయించుకోవడం, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల పోటీగా 50 శాతం పదవులు దక్కించుకుని కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తూ జనసేన నేతలను నిత్యం అవమానించేలా వ్యవహరిస్తున్నారు.
20 సొసైటీల్లో రెండు మాత్రమే
20 సొసైటీ చైర్మన్లకు 18 టీడీపీ, 2 జనసేనకు కేటాయింపు
5 ఇస్తామని ఒప్పందం చేసుకుని రెండు ఇవ్వడంపై మండిపాటు
సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన ఇన్‌చార్జి తీవ్ర అసహనం
20 సొసైటీలకు 2 ముష్టి వేస్తారా? అంటూ ఆగ్రహం
బీజేపీకి ఒక స్థానం కూడా దక్కని వైనం
చింతలపూడి నియోజకవర్గంలో మొత్తం 20 సొసైటీలున్నాయి. వీటిలో 15 సొసైటీలు టీడీపీ తీసుకుంటే.. కామవరపుకోట, పోతునూరు, గుర్వాయిగూడెం, తాడువాయి, వేగవరం సొసైటీలను జనసేనకు ఇస్తామని ఎమ్మెల్యే సొంగా రోషన్, జనసేన ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య, మరికొందరు నేతలు కలిసి మాట్లాడుకుని ప్రకటించారు. సామాజిక ప్రయోజనాల నేపథ్యంలో మేజర్ సొసైటీ తాడువాయిని మళ్ళీ టీడీపీ కావాల్సిందేనని పట్టుపట్టి వెనక్కి తీసుకున్నారు. ఆ తరువాత ఇదేరీతిలో వేగవరాన్ని కూడా కుడిచేతితో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకున్నారు. ఇక పోతునూరు, గుర్వాయిగూడెంకు జనసేనను పరిమితం చేశారు. తిరుమలాపురం జనసేనకు ఇస్తామని గతంలో హామీఇచ్చారు. అయితే జనసేన ఇచ్చిన పేరు కాకుండా జనసేనలో ఎమ్మెల్యే రోషన్‌కు సన్నిహితుడైన వ్యక్తి పేరును జనసేన నేతలతో సంప్రదించకుండా ఇవ్వడంపై రగడ కొనసాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో జనసేన ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య సోషల్ మీడియా, వాట్సప్‌ల్లో భారీ పోస్టులు పెట్టి ఇదేనా పొత్తు ధర్మం.. జనసేనను ఎమ్మెల్యే రోషన్ అడుగడుగునా మోసం చేస్తూనే ఉంటారా? జనసేన పార్టీలోనూ ఎమ్మెల్యేదే పెత్తనమా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పోస్టు జిల్లాలో వైరల్‌గా మారింది. ఇదే క్రమంలో పోలవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట 24 సొసైటీలుంటే 10 టీడీపీ, 14 జనసేన దక్కించుకుంది. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరులో 17 సొసైటీలుంటే 8 జనసేన, 8 టీడీపీ, ఒకటి బీజేపీ పంచుకుంది. పోలవరం, చింతలపూడిలో బీజేపీని పూర్తిగా అటకెక్కించడం, చింతలపూడిలో జనసేనను 10 శాతానికి పరిమితం చేయడంపై రగడ కొనసాగుతోంది.