
ప్రజల్ని మోసగించడంలో బాబు దిట్ట
చింతలపూడి: ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక వీకేఎం ఫంక్షన్ హాల్లో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ చింతలపూడి మండల పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు ఎస్.రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక జగన్ వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని అసత్య ప్రచారాలు, బురదజల్లే కార్యక్రమాలు తప్ప ప్రజలకు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నూరు శాతం అమలు చేసి ప్రపంచ చరిత్రలోనే జగన్‌మోహన్ రెడ్డి మన్ననలు పొందారన్నారు. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ అద్భుతం అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పని హెచ్చరించారు. కేసులకు భయపడద్దని ధైర్యంగా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు నైజాన్ని ఎండగట్టాలి: విజయరాజు
రాష్ట్రంలో చంద్రబాబు నయవంచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబు నైజాన్ని గడపగడపకు వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ విభేదాలతో పార్టీని బలహీనపరచొద్దని కార్యకర్తలను కోరారు. అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి పార్టీని గెలిపించుకోవాలని చెప్పారు. సమావేశంలో పార్టీ మండల అనుబంధ సంఘాలకు ఎంపికై న నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్ రెడ్డి, జెట్పీటీసీ ఎం.నీరజ సుధాకర్, ఎంపీపీ డాక్టర్ బి.రాంబాబు నాయక్, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చింతలపూడిలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ సమావేశంలో డీఎన్నార్