న్యాయం జరిగే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

న్యాయం జరిగే వరకూ పోరాటం

Aug 9 2025 5:01 AM | Updated on Aug 9 2025 5:01 AM

న్యాయం జరిగే వరకూ పోరాటం

న్యాయం జరిగే వరకూ పోరాటం

ఉండి: మండలంలోని పాములపర్రు దళిత శ్మశాన వాటికలో ఆక్వా రైతుల కోసం రోడ్డు వేయాలనే నిర్ణయంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శుక్రవారం మాల మహానాడు సంఘాలు, కేవీపీఎస్‌, సీపీఎం, అంబేడ్కర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, అంబేడ్కర్‌ మిషన్‌ వంటి సంఘాల నాయకులు పాములపర్రు దళితులను పరామర్శించి శ్మశాన వాటికను పరిశీలించారు. పాములపర్రు ఘటనపై పోలీసుల దౌర్జన్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. శ్మశానం జోలికి ఎవరు వచ్చినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు దళితులపై ఎందుకంత కక్ష అని వారు ప్రశ్నించారు. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వడం కాదని శ్మశాన వాటికకు వచ్చి చూస్తే రోడ్డు ఎవరికోసం వేస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.ఎవరో ఇద్దరు ఆక్వారైతుల కోసం రోడ్డు వేయిస్తూ వందల మంది దళితులను ఎందుకు బాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 150 ఏళ్ల నుంచి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక భూమిని ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి దళిత పేటకు రెండెకరాల వరకు భూమి ఇవ్వాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే ఇప్పుడు ఆ భూమిలో రోడు వేస్తామనడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డులను మాలమహానాడు నాయకులు అడుగుతుంటే సర్వే, రెవెన్యూ శాఖాధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే ఉద్యమం తీవ్రతరం కాక తప్పదని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా 144 సెక్షన్‌ ఎత్తేసి పోలీసులు వెళ్లిపోవాలని వారు డిమాండ్‌ చేశారు. పరామర్శించిన వారిలో మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్‌, జిల్లా అధ్యక్షుడు గుండు నగేష్‌, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్‌, దానం విద్యాసాగర్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతిబాబు, జిల్లా అధ్యక్షుడు విజయ్‌, సీపీఎం జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్‌, అంబేడ్కర్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్‌ ఉన్నారు.

మండల వ్యాప్తంగా 144 సెక్షన్‌

మండల వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు మండలంలో ప్రచారం చేయించారు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను కూటమి నాయకులు చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు.

దళిత శ్మశాన వాటికలో రోడ్డు వేస్తారా?

పాములపర్రులో దళిత సంఘాల నేతల ఆగ్రహం

కూటమి నాయకులు, పోలీసుల మైండ్‌గేమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement