యర్రంపేట వాసికి గిన్నిస్‌ బుక్‌లో చోటు | - | Sakshi
Sakshi News home page

యర్రంపేట వాసికి గిన్నిస్‌ బుక్‌లో చోటు

Apr 16 2025 12:55 AM | Updated on Apr 16 2025 12:55 AM

యర్రంపేట వాసికి గిన్నిస్‌ బుక్‌లో చోటు

యర్రంపేట వాసికి గిన్నిస్‌ బుక్‌లో చోటు

కొయ్యలగూడెం: యర్రంపేటకు చెందిన కీబోర్డ్‌ కళాకారుడు జీవన్‌ ప్రసాద్‌ గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించాడు. మంగళవారం ఆ వివరాలకు విలేకరులకు వెల్లడించారు. హాలెల్‌ అంతర్జాతీయ మ్యూజిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో పద్దెనిమిది దేశాలకు చెందిన కీబోర్డ్‌ కళాకారులతో ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. గంటసేపు అంతరాయం లేకుండా ప్లేచేస్తూ నైపుణ్యత కనబరిచిన 1046 మందిని విజేతలుగా ప్రకటించారన్నారు. విజేతల్లో తాను ఉన్నానని, ఈ నేపథ్యంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేశారన్నారు. గిన్నిస్‌ అద్జిడికేటర్‌ రిచర్డ్‌ స్టిన్నింగ్‌ అవార్డులను హైదరాబాదులో ప్రదానం చేసినట్లు చెప్పారు.

క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు వాయిదా

ఏలూరు రూరల్‌ / టౌన్‌: ఈ నెల 17, 18 తేదీల్లో ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్‌, అండర్‌–23, అండర్‌–19 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు వాయిదా వేసినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌న్‌ అధ్యక్షుడు జి ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ పోటీలు వాయిదా వేశామని, తదుపరి తేదీలను పత్రికల ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌పై వచ్చిన పలు ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించిందని కమిటీ చైర్మన్‌ చవాకుల కాశీ విశ్వేశ్వరరావు మరో ప్రకటనలో తెలిపారు.

అంబేడ్కర్‌ను అవమానించిన కేసులో ఇద్దరికి రిమాండ్‌

భీమడోలు: రాష్ట్రీయ రహదారి పోలసానిపల్లి ఎస్సీ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను మంగళవారం భీమడోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 12వ తేదీ రాత్రి గుర్తు తెలియని అగంతకులు అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఉండి సాయి వీరాస్వామి, ఆతని తండ్రి ఉండి రాంబాబులను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారిని భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు ఎస్సై వై.సుధాకర్‌ తెలిపారు.

నలుగురికి తీవ్ర గాయాలు

పెనుమంట్ర: బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌ బొలెరో వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన పెనుమంట్ర– బ్రాహ్మణ చెరువు గ్రామాల మధ్యలో మంగళవారం రాత్రి జరిగింది. ఇద్దరు యువకులు, ఒక యువతి బుల్లెట్‌ వాహనంపై ప్రయాణిస్తూ దారిలో నడిచి వెళుతున్న ఒక యువతిని ఢీకొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్నా బొలెరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో బుల్లెట్‌పై వెళుతున్న ముగ్గురితోపాటు రోడ్డుపై నడిచి వెళ్తున్న యువతికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. నడిచి వెళ్తున్న యువతి స్థానిక ఆసుపత్రికి, ఆ ముగ్గిరిని 108 వాహనంలో తణుకు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement