గ్రేట్‌ ఇండియన్‌ ‘దేజా వూ’

Vardhelli Murali Article On US Warship Enters Indian Waters - Sakshi

జనతంత్రం

పరిణామాలు కొన్ని వింతగొలుపుతున్నవి. చరిత్ర పునరావృత మవుతున్నట్టుగా తోస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ గతంలోనే చూసినట్టు తోచే మానసిక స్థితిని దేజా వూ అంటారు. ఇప్పుడు మస్తిష్కం నిండా దేజా వూ! అమెరికా సప్తమ నౌకా దళానికి (సెవెంత్‌ ఫ్లీట్‌) చెందిన యుద్ధనౌక ఒకటి శుక్రవారం నాడు భారత పొలిమేరల్లోకి వచ్చింది. అది కూడా స్నేహపూర్వ కంగా కాదు. ఆ నౌకాదళం విడుదల చేసిన ప్రకటన చూస్తుంటే దాని ధోరణి భారత సార్వభౌమాధికారాన్ని సవాల్‌ చేస్తున్నట్టు గానే ఉన్నది. ఏ దేశానికైనా తీరం నుంచి రెండొందల నాటికల్‌ మైళ్ల దూరం వరకు ప్రత్యేక వాణిజ్య హక్కులుంటాయి. ఆ పరిధి దాటి లోపలికి రావాలంటే అనుమతి అవసరం. ఇది 1976 నాటి మారిటైమ్‌ చట్టం ప్రకారం దేశాలకు దఖలుపడ్డ ప్రత్యేక హక్కు. ఇప్పుడా హక్కును అమెరికా సెవెంత్‌ ఫ్లీట్‌ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది.

మార్కెట్లో వ్యాపారుల దగ్గర మామూళ్లకోసం ముందుగా ఓ ఆకు రౌడీ వస్తాడు. మాట వినకపోతే ఆ వెనుక చాకురౌడీ వస్తాడు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా సెవెంత్‌ ఫ్లీట్‌ ఈ చాకు రౌడీ పాత్రను పోషిస్తున్నది. ఫిలిప్పీన్స్, కొరియా, వియత్నాంల నుంచి పడమట పర్షియన్‌ గల్ఫ్‌ వరకు పలుచోట్ల సప్తమ నౌకాదళం యుద్ధనౌకలు గతంలో లంగరేశాయి. ఎక్కడ లంగరు వేసినా సరే, అక్కడ ఆకాశంలో ఏదో మర్డర్‌ జరిగినట్టుగా ఎర్ర బారుతుంది. సూర్యుడు నెత్తురు కక్కుతున్నట్టుగా కనిపిస్తాడు. ఒక్క మాటలో సెవెంత్‌ ఫ్లీట్‌ వృత్తాంతం మొత్తం ఇదే.

భారత్‌పై సెవెంత్‌ ఫ్లీట్‌ తాజా కవ్వింపు యాభయ్యేళ్ల కిందటి సంగతిని గుర్తు చేస్తున్నది. భారత్‌–పాక్‌ల మధ్య బంగ్లా యుద్ధంలో జరుగుతున్న రోజుల్లో కూడా సెవెంత్‌ ఫ్లీట్‌ బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే భారత్‌–రష్యాల మధ్య సైనిక సహకార ఒప్పందం ఉన్న కారణంగా అమెరికా ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న తూర్పు బెంగాల్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) ప్రజలను పాక్‌ సైనిక పాలకులు రెండోశ్రేణి పౌరులుగా చులకన చూసేవారు. బెంగాలీ సంస్కృతిని చిన్న చూపు చూసేవారు. ఈ వైఖరిపై బెంగాలీ ప్రజల నిరసన జాతీ యోద్యమం రూపుదాల్చింది. ఉద్యమంపై పాక్‌ పాలకులు ఉక్కుపాదం మోపారు. లక్షల సంఖ్యలో తూర్పు బెంగాలీలు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోకి ప్రవేశించారు.  అంది వచ్చిన అవకాశాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కారకులయ్యారు. అప్పటినుంచి ఆమె ప్రభ మధ్యందిన మార్తాండ తేజంతో వెలిగిపోయింది. నాటి జన సంఘ్‌ నాయకుడు వాజ్‌పేయి సైతం ఆమెను అపర కాళికా దేవిగా కొనియాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవకాంత బారువా ఒకడుగు ముందుకువేసి ఇందిర ఈజ్‌ ఇండియా–ఇండియా ఈజ్‌ ఇందిర’ అనే నినాదాన్ని ప్రచారంలో పెట్టాడు. బంగ్లా యుద్ధం భారత రాజకీయాలను మలుపు తిప్పింది. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థకు తోడుగా, ఏకవ్యక్తి నియంతృత్వ పాలన కాంక్ష కూడా ఇందిరలో ప్రబలింది. ఇది ఎమర్జెన్సీకి దారి తీసింది. చివరకు ఇందిరమ్మ సర్కార్‌ ఎన్నికల్లో కుప్పకూలింది.

ఇప్పుడు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్ని కలకూ భారత పొలిమేరల్లోకి వచ్చిన అమెరికా సెవెంత్‌ ఫ్లీట్‌ యుద్ధ నౌకకూ ఎటువంటి సంబంధం లేదు. ఆ నౌక బంగాళా ఖాతంలోకి కూడా రాలేదు. అరేబియా సముద్రంలో లక్షద్వీప సముదాయానికి చేరువగా వచ్చింది. కాకపోతే బెంగాల్‌ ఎన్నికల ఫలితాలకు మాత్రం భారత రాజకీయాలను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్నది. ఒకవేళ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ బెంగాల్‌లో గెలిస్తే అశోకుడు కళింగ యుద్ధం గెలిచినట్టే. ఆర్యావర్తమంతటా కాషాయ ధ్వజారోహణం జరిగినట్టే. మిగిలి పోయే కొన్ని దక్షిణాది రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల పొత్తులతో నెట్టుకురావల్సిందేనన్న అవగాహన ఆ పార్టీకి ఉన్నది. యుద్ధాల అవసరం పూర్తయిన తర్వాత అశోకుడు శేషజీవితాన్ని ధర్మ ప్రచారానికి వెచ్చించాడు. బెంగాల్‌ సవాల్‌ను బీజేపీ విజయ వంతంగా అధిగమించగలిగితే ఇక దేశంలో ఏకధ్రువ రాజకీ యాలు పునరావృతమవుతాయి. ఆరెస్సెస్‌ భావజాల వ్యాప్తికి మార్గం సుగమమవుతుంది. 1952 నుంచి 89 వరకు కాంగ్రెస్‌ నాయకత్వంలో ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కొనసాగింది.  1967లో తొమ్మిది రాష్ట్రాల్లో, 1977లో కేంద్ర స్థాయిలో కంగు తిన్నప్పటికీ 89 వరకు ఈ వ్యవస్థ నిలబడగలిగింది. అప్పటి నుంచీ పదేళ్లపాటు దేశ రాజకీయాలది ప్రయోగశీల దశ. 1999 నుంచి 2019 వరకు రెండు కూటముల ద్వయీ ధ్రువ రాజకీయాలు నడిచాయి. బెంగాల్‌లో గెలిస్తే మరోసారి ఏకధ్రువ వ్యవస్థకు పునాది పడుతుంది. ఈ పరిస్థితి మరోసారి నియంతృత్వ పోకడలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఇందిరాగాంధీలో పొడసూపిన నియంతృత్వ పోక డలు ఆమె వ్యక్తిగత స్థాయికే పరిమితం. కానీ ఇప్పుడు నడిచేది నరేంద్రమోదీ అయినా, నడిపించేది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని నియంత్రించేది సుసంఘటితమైన ఆర్‌ఎస్‌ఎస్‌. ఎదురు లేని అధికారం ఒకవేళ ఇప్పుడు నియంతృత్వ పోకడలకు బాటలు వేస్తే ఆ నియంతృత్వం వ్యవస్థీకృతంగా ఉంటుంది తప్ప వ్యక్తిగతం కాబోదు. 

సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు, ఆశయాలు, రాజకీ యాలన్నింటిలోనూ కాంగ్రెస్‌కు బీజేపీ భిన్నమైన పార్టీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయ వలసిన అవసరం ఉంటుంది కనుక సంఘ్‌ భావజాలాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి కుదరడం లేదు. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కుదురుకుంటే రాజ్యాంగంలో అవసరమైన సవరణలకు బీజేపీ వెనుకాడక పోవచ్చు. బలమైన కేంద్రం దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. అందుకోసం రాష్ట్రాల అధికారాలను కత్తిరించే ప్రయత్నం చేస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం నిర్వీర్యమైన నేపథ్యంలో పార్టీకి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ప్రాంతీయ పార్టీల నుంచే గనక బలమైన రాష్ట్రాల ఉనికి రాజకీయంగా కూడా బీజేపీకి సమ్మతం కాదు. బెంగాల్‌ ఎన్నికల్లో గెలిస్తే ఈ దిశలో బీజేపీ ప్రయాణం వేగం పుంజుకుంటుంది. ఓడితే వేగం తగ్గుతుంది. 

మమతా బెనర్జీకి మాత్రం బెంగాల్‌ ఎన్నికలు జీవన్మరణ సమస్య. గెలిస్తే ఆమెకు జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర లభిస్తుంది. ఓడిపోతే పార్టీ మనుగడే కష్టం. ప్రభుత్వం, పోలీ సుల తోడ్పాటుతో చెలరేగడం తప్ప సంస్థాగతంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు అంత బలమైన పునాదులేమీ లేవు. పైగా ప్రతి పక్షాలపై విరుచుకుపడటం, దాడులు, దౌర్జన్యాలు చేయడం పశ్చిమ బెంగాల్‌ రాజకీయ సంస్కృతిలో భాగంగా మారాయి. నిర్మాణపరంగా బలమైన సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలే హింసా రాజకీయాల ధాటికి అల్లాడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రతిపక్షంగా నిలదొక్కుకోవడం మమతకు శక్తికి మించిన కార్యంగా మారుతుంది. ఇప్పుడు గెలవడమే ఆమె పార్టీ మనుగడకు ఏకైక మార్గం.

బెంగాల్‌లో ఏ ప్రాంతానికి వెళ్లినా ‘పరివర్తన్‌’ (మార్పు) అనే మాట బాగా వినపడుతున్నదని రాష్ట్రంలో పర్యటిస్తున్న వారు చెబుతున్నారు. పదేళ్ల కిందటి ఎన్నికలప్పుడు మొదటిసారిగా మమతా బెనర్జీయే ఈ మాటను ఉపయోగిం చారు. అప్పుడు జనంలో ఈ మాట మంత్రంలా మార్మోగింది. ఎన్నికల్లో నిజంగానే పరివర్తన జరిగింది. 34 ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన సీపీఎం కూటమి సర్కార్‌ కుప్పకూలింది. ఈసారి ఈ మాటను మోదీ ఉపయోగిస్తున్నారు. అసలు పరివ ర్తన్‌ (నిజమైన మార్పు) కావాలని ఆయన జనానికి చెబుతు న్నారు. జనంలోకి ఈసారి కూడా ఈ మాట బాగానే వెళ్లినట్టు కనిపిస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ చుట్టూ ఉన్న కోటరీలో అవినీతి ప్రబలిందనీ, వారు చేసే అరాచకాలు పెచ్చరిల్లాయని జనంలో ఒక అభి ప్రాయం ఏర్పడింది. దీనికితోడు బీజేపీ అమలుచేసిన సోషల్‌ ఇంజనీరింగ్‌ కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది.

సుదీర్ఘకాలంపాటు బెంగాల్‌ రాజకీయాలపై ఆధిపత్యం చలాయించిన కమ్యూనిస్టులు కులం సమస్యను గుర్తించలేదు. వెనుకబడిన కులాల అస్తిత్వ సమస్యలను, వాటి ఆకాంక్షలను అంచనావేయలేకపోయారు. మండల్‌ ఆందోళన దేశాన్ని కుది పేస్తున్న రోజుల్లో కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఈ అంశంపై ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ ‘మా రాష్ట్రంలో రెండే కులాలున్నాయి. ఒకటి పేదల కులం, రెండు ధనికుల కులం’ అన్నారు. అదీ, కుల సమస్యపై కమ్యూనిస్టుల అవగాహన. సమాజంలో క్రీమీలేయర్‌గా చలామణి అయ్యే చదువుకున్న వారు, ఉన్నత–మధ్యతరగతి వర్గం ప్రజలను బెంగాల్‌లో భద్ర లోక్‌ అంటారు. కమ్యూనిస్టుల నాయకత్వ శ్రేణుల్లో కూడా ఈ భద్రలోక్‌ బృందమే ఎక్కువగా ఉండేది. వాళ్లలో అత్యధికులు సహజంగానే ఉన్నత కులాలకు చెందినవాళ్లే ఉండేవారు. రైతులు, వ్యవసాయ – పారిశ్రామిక కార్మికులుగా ఉండే తక్కువ కులాలవారు భద్రలోక్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు అనుబంధ సంఘాల్లో సంఘటితమై ఉండేవారు. కానీ, నాయకత్వ శ్రేణు ల్లోకి పెద్దసంఖ్యలో చేరుకోలేకపోయేవారు. జ్యోతిబసు ముఖ్య మంత్రిగా 1978లో ప్రారంభించిన ఆపరేషన్‌ బర్గా (భూసంస్క రణలు) దేశంలో ఎక్కడా లేనంత పటిష్టంగా అమలైన కార ణంగా పదిహేను లక్షలమందికి కొత్తగా సేద్యపు భూమి దక్కింది. ఈ రైతులందరూ వారి జీవితకాలం పాటు ఎర్రజెండా నీడలోనే ఉండిపోయారు. కానీ తరువాతి తరం ఆకాంక్షలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. అలాగే పారిశ్రా మిక కార్మికులందరూ వామపక్ష కార్మిక సంఘాల్లో సభ్యులుగా ఉండేవాళ్లు. కనుక బెంగాల్‌ రాజకీయాల్లో కులం అనేది నిన్నమొన్నటివరకు ఒక సమస్యగా ముందుకు రాలేదు. కమ్యూ నిస్టుల తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ రాజకీయ– సామాజిక పొందికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. 

గడిచిన రెండు మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ బెంగాల్‌ సామాజిక సమీకరణాలపై బాగా దృష్టిపెట్టింది. వెనుకబడిన శూద్ర కులాల్లో, దళితుల్లో గిరిజనుల్లో ఉండే అస్తిత్వ ఆరాటాన్ని పసిగట్టి వాళ్లను నాయకత్వ శ్రేణుల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క భద్రలోక్‌ వర్గాన్ని కూడా జాతీయవాద భావ జాలంతో ఆకర్షించగలిగింది. బీజేపీ చాపకింద నీరులా చేపట్టిన ఈ సోషల్‌ ఇంజనీరింగ్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆలస్యంగా గుర్తించింది. దాంతో బెంగాల్‌ సంస్కృతిని హుటాహుటిన రంగంలోకి దించారు. బెంగాల్‌ సంస్కృతిపై మోదీ యుద్ధం చేస్తున్నారని మమత ప్రచారాన్ని ఎత్తుకున్నారు. అయితే బెంగాల్‌ సంస్కృతిగా మనం పరిగణించేది ప్రధానంగా అక్కడి భద్రలోక్‌ సంస్కృతి. ఈ సంస్కృతి వలయానికి ఆవల వున్న విశాల శ్రామిక ప్రజానీకం ఎంతమేరకు మమత పిలుపునకు స్పందిస్తారో వేచి చూడాలి. ప్రీపోల్‌ సర్వేలన్నీ మమతా బెనర్జీ విజయాన్ని ఘోషిస్తున్నాయి. గాలి చూస్తే ‘పరివర్తన్‌’ కోరు తున్నది.

మమతా బెనర్జీని బెంగాలీలు దీదీ అని పిలుచుకుంటారని తెలిసిందే. బీజేపీ వాళ్లు మాత్రం ప్రచారంలో వెటకారం చేస్తున్నారు. అరవయ్యారేళ్ల వయసులో దీదీ ఏమిటి? ‘పీషీ’ (అత్త) అనాలంటూ ప్రచారం చేస్తున్నారు. వయసు పెరిగితే మాత్రం వరస మారుతుందా? కాకపోతే బడా దీదీ (పెద్దక్క) అనొచ్చు. బడా దీదీ అనే మాట కూడా చాలా పాపులర్‌. సుప్ర సిద్ధ బెంగాలీ రచయిత శరత్‌ చంద్ర ఛటర్జీ నవలల్లో బడా దీదీ కూడా ఒకటి. శరత్‌ సాహిత్యం తెలుగులో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనక్కరలేదు. బడాదీదీ తెలుగు నవలతోపాటు ‘బాటసారి’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించిన సినిమాల్లో ఒకటి. ఇందులో హీరో అందుబాటులోనే ఉన్నంత కాలం భానుమతి (సినిమాలో బడా దీదీ) ఏదో చెప్పాలను కుంటూనే చెప్పలేకపోతుంది. అతడు దూరమైన తర్వాత దుఃఖిస్తూ ‘ఓ బాటసారీ... ననూ మరవకోయీ’ అని పాడు కుంటుంది. ఇప్పుడు మన బెంగాల్‌ బడా దీదీ ఇప్పటికే ఆ పరిస్థి తికి చేరుకున్నదా... ఆమెకు ఇంకా సమయం మిగిలే ఉన్నదా అనేది ఫలితాలతోనే తేలాల్సి ఉంది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top