
జనతంత్రం
‘‘ఠండా మతలబ్ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్ టాక్. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం.
దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ టెక్నిక్ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.
ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?
ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, సెల్‌ఫోన్‌ల మీదా తనకే పేటెంట్ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు.
ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.
ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్ సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.
అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్‌లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి.
ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?
ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు.
అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్‌పుట్ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్‌బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.
అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు.
ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.
ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?
శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం.
రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్ సిక్స్’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.
రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు.
బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.
ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు.
ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్ తీసుకువచ్చారు.
ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు.
‘‘వంద పాకిస్తాన్లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్ ముందు బలాదూర్’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు.
ఇటువంటి సైడ్ లైట్స్ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com