ఆర్కిమెడీస్‌ లా!

Vardhelli Murali Article On Archimedes Principle - Sakshi

జనతంత్రం

హరిశ్చంద్ర మహారాజు ఎందుకు దివాళా తీశాడు? సత్యవాక్పరిపాలనకోసం!. ఏమిటా సత్యవాక్కు?. విశ్వామిత్ర మహర్షి ఒకనాడు మహారాజును కలిసి ‘రాజా, నేనొక యాగాన్ని తల పెట్టాను. దానికి కొంత ధనసాయం చేయాల’ని అడిగాడట. దాందేముంది ఇచ్చేస్తాను, ఎంత కావాలో కోరుకోండని హరి శ్చంద్రుడు బదులిచ్చాడట. అందుకు ఆ మహర్షి అడిగిన మొత్తాన్ని చెల్లించుకోలేక సర్వం ధారపోసి, భార్యాబిడ్డలతో బానిస జీవితం గడపడానికి మహారాజు సిద్ధపడవలసి వచ్చింది. ఇంతకూ మహర్షి అడిగిందెంత?. మీ రాజ్యంలోనే అందరికంటే బలవంతుడైన వాడొకడు, భారీ మదపుటేనుగుపై నిలబడి అతని శక్తి మేరకు ఒక రాయిని ఆకాశం వైపు విసిరితే ఆ రాయి ఎంత ఎత్తుకు పోతుందో అంత ఎత్తు ధనరాశి కావాలని అడి గాడట. మాట తప్పనివాడు కనుక, ఆ మహారాజు తన సంపదనూ, రాజ్యాన్ని మొత్తం ధారపోశాడట. అయినా అంత ఎత్తుకు రాలేదు. కొంత తక్కువ పడింది. ఆ మొత్తాన్ని కష్టపడి పనిచేస్తూ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేస్తామని చెప్పి కట్టుబట్టలతో మహారాజు దేశాంతరం వెళ్లాడు. వాయిదాలను వసూలు చేసుకోవడానికి వారివెంట నక్షత్రకుడనే ఏజెంట్‌ను కూడా విశ్వామిత్రుడు పంపించాడు.

ఇప్పుడు మన ఆధునిక బిలియనీర్ల సంపదతో పోల్చిచూసినపుడు ఔరా... మన రాజులూ, మహారాజులూ ఎంతటి పూర్‌ ఫెలోసో కదా! అనిపించక మానదు. ఒకడు ఏనుగుపై నిలబడి ఒక రాయిని బలంగా పైకి విసిరితే ఎంత పైకి వెళ్తుంది?. మాగ్జిమమ్‌ అర కిలోమీటర్‌?. పోనీ సూపర్‌ మ్యాన్‌ అయితే ఒక కిలోమీటర్‌ అనుకుందాం. మన బిలియనీర్ల సంపదను ఒకసారి పరిశీలిద్దాం. మనదేశంలోని 100 మంది అగ్రశ్రేణి శ్రీమంతుల సంపద లాక్‌డౌన్‌ నుంచి తొమ్మిది మాసాల (కరోనా వేవ్‌ 1) కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందట. రెండువేల డినామినేషన్‌ కలిగిన వంద నోట్ల కట్ట విలువ రెండు లక్షల రూపాయలు. ఆ కట్ట ఎత్తు ఒక సెంటీమీటర్‌ ఉండొచ్చు. ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతే ఒక కిలోమీటర్‌ ఎత్తుకు రెండువేల కోట్లు చాలు. ఒకే కట్టగా అంత ఎత్తుకు పేర్చడం కష్టం కనుక, కిందపడకుండా ఉండేందుకు వంద కట్టలను ఆనించి పేర్చి చూద్దాము. అంటే వరసకు రెండు కోట్లు చొప్పున. రెండు లక్షల కోట్లతో ఒక కిలోమీటర్‌ ఎత్తుకు పేర్చ వచ్చు. మన 100 మంది శ్రీమంతులు కలిసి తొమ్మిది నెలల్లో సంపాదించిన సొత్తుతోనే కిలోమీటర్‌ చొప్పున ఇటువంటి ఆరున్నర శిఖరాలను నిర్మించగలరు. పాపం హరిశ్చంద్ర మహారాజు ఒక్క శిఖరాన్ని తయారుచేయలేకపోయాడు. సత్యకాలం మనిషి కదా!

ప్రపంచంలోని టాప్‌ టెన్‌ శ్రీమంతుల సంపాదన ఈ తొమ్మిది మాసాల్లోనే 540 బిలియన్‌ డాలర్లట. అంటే మన రూపాయల్లో సుమారుగా 38 లక్షల కోట్లు. ఏనుగు పైకి కాదు, ఎవరెస్ట్‌ శిఖరంపైకెక్కి ఒక దృఢమైన వ్యక్తి బలంగా రాయిని ఎంత పైకి విసరగలడో అంత ఎత్తుకూ పేర్చగల సంపాదన. ఇలాన్‌ మస్క్‌ ఒక్కడి ఆర్జనే 128.9 బిలియన్‌ డాలర్లు. మన రూపాయి లెక్కల్లో తొమ్మిది లక్షల కోట్ల పైచిలుకు. ఆక్స్‌ఫామ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వందలాదిమంది ఆర్థిక నిపుణులను రంగంలోకి దించి నిగ్గుతేల్చిన లెక్కలివి. శ్రీమంతులను మరింత శ్రీమంతులను చేయడం మాత్రమే కరోనా కర్తవ్యం కాదు. దీనికి మరో లక్షణం కూడా ఉన్నది. అది పేదలను మరింత పేదలను చేసింది. భారతదేశంలోనే సుమారు 13 కోట్లమంది అత్యంత పేదల జీవితం మరింత దుర్భరంగా మారిందని ఒక అంచనా. ఉపాధి అవకాశాలు జారిపోయాయి. తృణమో పణమో సంపాదించుకున్న సొమ్ము కరిగిపోయింది. మన టాప్‌ హండ్రెడ్‌ శ్రీమంతులు వారి తొమ్మిది నెలల లాభాన్ని ఈ నిర్భాగ్యులకు పంచాలి అనుకుంటే తలకో లక్ష రూపాయలు చొప్పున వితరణ చేయవచ్చు. లెక్క సరిగ్గా సరిపోతుంది. దీన్నే ఇంకోరకంగా చెప్పవచ్చు. దేశంలో అత్యధికంగా నష్టపోయిన అత్యంత దిగువశ్రేణి ప్రజలు కోల్పోయిన సంపదను, ఆదాయాన్ని లెక్కిస్తే సగటున లక్షకంటే ఎక్కువగానే ఉండొచ్చు. వీరు కోల్పోయిన సొమ్ములో అత్యధిక భాగం దేశంలోని టాప్‌ 100 శ్రీమంతుల చెంతకు చేరింది. లాక్‌డౌన్‌ సమయంలో లాంగ్‌ మార్చ్‌ చేసిన వారంతా ఈ 13 కోట్ల కేటగిరీ ప్రజలే. వీరే కాకుండా మధ్యతరగతి వారు, చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, చిన్న పరిశ్రమల నిర్వాహకులు కూడా కొన్ని కోట్లమంది నష్టపోయారు. వీరు నష్టపోయిన సంపద పరిమాణమెంతో ఇప్పటికీ కచ్చితమైన లెక్కల్లేవు. వందమంది అగ్రశ్రేణి శ్రీమంతులే కాకుండా మరికొన్ని వందలమంది లేదా వేలమంది సంపన్నులు కూడా భారీగానే లాభపడ్డారు. వారికి లాభించిన మొత్తం ఎంతో ఇంకా లెక్కలు తేలవలసి ఉంది. ఈ కరోనా వైరస్‌ అనేదానికి ఒక కచ్చితమైన వర్గ దృక్పథం ఉన్నదని ఈ లెక్కలను బట్టి అర్థమవుతున్నది. ఇది ధనికుల పక్షపాతి. ఇది పేదల ద్వేషి.

ఆర్కిమెడీస్‌ ప్రిన్సిపుల్‌ అనే భౌతికశాస్త్ర సూత్రాన్ని కరోనా ఆర్థికశాస్త్రంలో ప్రవేశపెట్టింది. కొంత ఘనపరిమాణం కలిగిన ఒక వస్తువును ఏదైనా ద్రవంలో గానీ, గ్యాస్‌ (వాయువు)లో గానీ వేసినప్పుడు ఆ వస్తువు కొంతభారాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. అలా కోల్పోయినట్లనిపించే భారం ఎంత?. ఆ ద్రవంలో వస్తువు ఆక్రమించే స్థలం నుంచి చెదిరిపోయిన (displaced) ద్రవం భారంతో సమానమట. మన శ్రీమంతులు సంపాదించిన సొత్తు విలువ కూడా మన పేదలు పోగొట్టుకున్న సంపద విలువతో సమానం. ఆర్కిమెడీస్‌ చేసిన ఈ పరిశీలన పైనే Theory of bouyancy అభివృద్ధి చెందింది. ఏ వస్తువైతే తాను ఆక్రమించిన స్థల పరిమాణాన్ని మించి ద్రవాన్ని, వాయువును చెదరగొడుతుందో ఆ వస్తువు తేలియాడుతుంది. ఈ ప్రాతి పదికపైనే మన ఓడలు తేలుతున్నాయి. విమానాలు ఎగురుతున్నాయి. మన శ్రీమంతులు మరింత ఎత్తుకు ఎగరాలంటే అవసరమైనంత పెద్ద సంఖ్యలో పేదలను, రైతులను, భూముల నుంచి, సహజ వనరుల నుంచి చెదరగొట్టాలేమో. అలా చెదర గొట్టేంతవరకు కరోనా సెకండ్, థర్డ్, ఫోర్త్‌ వేవ్‌లు వస్తాయేమో!. రావనే గ్యారంటీ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత కూడా అటువంటి హామీ ఇవ్వలేమని డాక్టర్లు, ఆరోగ్య అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులూ స్పష్టంగానే చెబుతున్నారు.

వ్యాక్సినేషన్‌పై వివిధ రంగాల నిపుణులతో వచ్చిన ఇంటర్వ్యూల సారాంశాన్ని ఒకసారి గ్రహించండి. ‘వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత ఇక మాస్క్‌ పెట్టుకోవలసిన అవసరం లేదా?’. ‘లేదు... లేదు, వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే మాస్క్‌ను తప్పక ధరించవలసిందే’. ‘శానిటైజర్‌తో పని ఉండదా?’. ‘శానిటైజర్‌ వాడుతుంటేనే మంచిది’. ‘భౌతిక దూరం పాటించ వలసిన అవసరం లేదా?’. ‘తప్పనిసరిగా పాటించాలి’. ‘ఈ నిబంధనలన్నీ పాటిస్తే వ్యాక్సినేషన్‌తో పనేమిటి?’. ‘ప్రజా రోగ్యం దృష్ట్యా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోండి. వ్యాక్సిన్‌ సురక్షితం’. ఇదీ వరస. వ్యాక్సిన్‌ సురక్షితం అని చెబుతారు కానీ, దానివల్ల కరోనా రాదని ఇంతవరకూ ఎవరూ రూఢీగా చెప్పలేదు. గడిచిన ఏడాది కాలంలో కరోనా వల్ల సంభవించిన మరణాల రేటు మనదేశంలో 1.4 శాతం. ప్రపంచంలో 2.3 శాతం. క్షయ, క్యాన్సర్, కొన్నిరకాల విషజ్వరాల వల్ల భారత్‌లో సంభవిస్తున్న మరణాల శాతం ఇంతకంటే ఎక్కువే.

ఈ భూగోళం మీద డబ్బు అనే పదార్థం పలుమార్లు జైత్ర యాత్ర చేసి విజయగర్వంతో సామాజిక సూత్రాలను తిరగ రాయడం మొదలుపెట్టింది. తనకు సంబంధం లేకుండా వాటి మానాన అవి బతుకుతున్న దేశాలన్నిటినీ చెవి మెలేసి లాక్కొచ్చి తన గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో ఇరికించేసింది. ఇప్పుడు అన్ని దేశాలూ, వ్యవస్థలూ డబ్బు ఉచ్చులో బందీలే. దేశాలూ, వ్యవస్థలే కాదు. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం, వ్యవహారం అన్నీ డబ్బు నిర్దేశించిన కక్ష్యలోనే (orbit) పరిభ్రమించాలి. తన ప్రయాణం అనుకున్నంత సాఫీగా లేదని డబ్బు భావించిన ప్పుడు ఏదో ఒకరంగంలో course correctionకు ఆదేశిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యరంగంలో అటువంటిదేదో జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ధనం సృష్టించిన గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో అన్ని దేశాలూ అవిభాజ్య భాగాలైన తర్వాత జనం ఆలోచనల్లో, ఆదర్శాల్లో, సిద్ధాంతాల్లో కళలు–సంస్కృతులపైన వారి దృక్ప థాల్లో నెమ్మదిగా మార్పులు చోటుచేసుకోవడం మొదలైంది. ఈ సంక్షోభ సమయంలో ఆ మార్పులు పూర్తి వేగాన్ని పుంజుకుం టున్నాయి. ఇప్పుడు కొత్త విలువలూ, కొత్త సిద్ధాంతాలు, కొత్త దృక్పథాలు మొగ్గతొడుగుతున్నాయి.

ఇరవయ్యో శతాబ్దంలో భారతదేశం శ్వాసించిన అనేక విలు వలు, ఆశయాలు, ఆదర్శాలు ఇప్పటి తరానికి వెగటు కలిగిస్తున్నాయి. అలా కలిగేలా ఒక నెట్‌వర్క్‌ గత కొంతకాలంగా పావులు కదుపుతున్నది. సామ్యవాదం, లౌకిక వాదం పాడై పోయిన పాచి పదార్థాలిప్పుడు. ప్రజాస్వామ్యాన్ని ద్వేషించే వాళ్లకూ తక్కువ లేదు. ఈ దేశానికి ఒక డిక్టేటర్‌ కావాలంటూ ఉపన్యసించే వీడియో ప్రసంగకేసరులు పెరిగిపోతున్నారు. చిరకాలం భిన్న సంస్కృతులు, జాతులు, భాషలు, నాగరికతలతో విలసిల్లిన భారతదేశం ఇప్పుడు కొందరి కళ్లకు ఏకీకృతంగా కనిపిస్తున్నది. జాతుల స్వతంత్ర ప్రతిపత్తి కోరిక దేశద్రోహంగా వినిపిస్తున్నది. మన మెదళ్లు ఇటువంటి కొత్తరాగాలకు ట్యూన్‌ అవడం మొదలవగానే మార్పులు తరుముకొస్తున్నాయి. ఒక ప్పుడు వండర్స్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ జాబితాలో తాజ్‌మహల్‌ ఉన్నందుకు గర్వపడేవారు. ఇప్పుడు ఆ జాబితా మారిపోతున్నది. ఇలాన్‌ మస్క్, జెఫ్‌ బిజోస్, జాక్‌మాలతో కూడిన జాబితా ముందుకొస్తున్నది. ఆ జాబితాలో మన ముకేశ్‌ అంబానీ కూడా చేరినందుకు ఆనందం అలుముకుంటున్నది. మరికొందరు భార తీయులు కూడా అందులో చేరాలన్న కాంక్ష నరనరాన ప్రవ హిస్తున్నది. భిన్నజాతుల సమాహారమైనందున ఈ దేశాన్ని ఫెడరల్‌ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్‌ రాజ్యాంగ రచనా కాలంలోనే గట్టిగా వినిపించింది. రాజ్యాంగం కూడా అందుకు అనుగుణంగానే ఫెడరల్‌ స్వభావానికి పెద్దపీట వేసింది. కాకపోతే ఫెడరేషన్‌ అనే మాటకు బదులు యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ అనే మాటను వాడింది. అందుకు అప్పటి రాజకీయ పరిస్థితులు కారణం. బ్రిటిష్‌ కాలం తర్వాత చిన్నాచితకా కలిపి దాదాపు 500 స్వతంత్ర రాజ్యాలను దేశంలో విలీనం చేయవలసి వచ్చింది. కశ్మీర్, హైదరాబాద్‌ల విలీనం తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్‌ అనే మాటను వాడకుండా ఫెడరల్‌ స్వభావాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ స్ఫూర్తిని కేంద్రం వమ్ముచేస్తున్నదనే విమర్శ 1967 నుంచే బలంగా వినపడేది. ఎన్టీ రామారావైతే ఒకడుగు ముందుకువేసి కేంద్రం మిథ్య అని ప్రకటించారు.

రాజకీయ నాయకుల్లోనే కాదు విద్యావేత్తల్లో, మేధావుల్లో కూడా రాష్ట్రాలకు విస్తృతాధికారాలు కావాలన్న కాంక్ష బలంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. టెలివిజన్‌లలో క్రికెట్‌ మ్యాచుల ద్వారా, కార్గిల్‌ వీరుల శవయాత్రల ద్వారా బలవంతంగా జనం మెదళ్లలో దేశభక్తి, కేంద్ర భక్తి పర్యాయ పదాలుగా ఎక్కించారు. జనం ఆలోచనల్లో ఆశించిన మార్పు సంకేతాలు కనబడగానే రాష్ట్రాల అధికారాలపై దండయాత్ర మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ కథ ముగిసింది. హైదరాబాద్‌ విషయంలో అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పిన జోస్యం నిజం కాదని చెప్పలేము. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మోదీ సర్కార్‌ ఆలోచిస్తున్నట్టు కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోపించారు. ఒక్క హైదరాబాదే కాదు, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై తదితర ఆదాయం సమకూర్చే మహానగరాలను కబ్జా చేసి రాష్ట్రాలను నిర్వీర్యం చేసే ఆలోచన కేంద్రం చేయదని చెప్పలేము. జరుగుతున్న పరిణా మాలే ఈ అనుమానాలకు బలం. విద్య, వైద్యం, నీటిపారుదల ఇలా ఒకటేమిటి, అన్ని అంశాలపైనా కేంద్రం కర్రపెత్తనం యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నది.

ప్రస్తుతానికైతే మనం కరోనా సంక్షోభం గురించి మాత్రమే మాట్లాడాలి. కరోనా విపత్తు నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న మహనీయుల గురించి మాత్రమే మాట్లాడాలి. రైతన్నలపై దాడి చేసేందుకు తోడేళ్ల గుంపు సిద్ధంగా ఉందన్న విషయం మాట్లాడేందుకు ఇది సమయం కాదు. వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు గౌరవనీయమైన స్థానం కల్పించిన ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ గురించి అస్సలు మాట్లాడకూడదు. ఒకవైపే చూడాలి. రెండో వైపు చూడొద్దు. కరోనా రక్కసితో కేంద్రం భీకర యుద్ధం చేస్తున్న సమయంలో అనేక వింతలు చోటుచేసుకోవచ్చు. పగలే చీకట్లు కమ్మవచ్చు. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపడవచ్చు. ఇలాంటివే ఇంకెన్నో వింతలు జరగవచ్చు. అయినా మనం దృష్టి మరల్చరాదు. వ్యాక్సిన్‌ సురక్షితం. మనందరం వ్యాక్సిన్‌ తీసుకుందాము. ప్రభుత్వ ఆదేశాలను పాటిద్దాం. మాస్క్‌ వేసుకుందాము. నోరు మూసుకుందాము.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top