కాంగ్రెస్‌ తీరు మారినట్టేనా?

Sonia Gandhi Talks With Congress Rebel leaders - Sakshi

పార్టీ సీనియర్‌ నేతలు రాసిన లేఖపై గత నాలుగు నెలలుగా మౌనంగా వుండిపోయిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టకేలకు ‘సరైన విధానం’లో స్పందించినట్టు కనబడుతోంది. శనివారం మొదలుపెట్టి వరసగా కొన్ని రోజులపాటు సీనియర్‌ నాయకులతో ఆమె చర్చిస్తారని... వారిలో లేఖరాసిన నాయకులు కూడా వుంటారని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. రైతు ఉద్యమం, పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు వంటి సమ స్యల్ని చర్చించడానికని చెబుతున్నా అసమ్మతిని చల్లార్చడమే దీనిలోని ఆంతర్యమని వస్తున్న ఊహా గానాలు కొట్టివేయదగ్గవి కాదు. సమస్య తలెత్తినప్పుడు, సంక్షోభం ఏర్పడినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడటం సరైందే. కానీ ఇందుకామె సుదీర్ఘ సమయం తీసుకున్నారు. అంతేకాదు...తన విధేయు లతో లేఖ రాసినవారికి వ్యతిరేకంగా ప్రకటనలిప్పించారు. వారిపై జీ–23గా ముద్ర కొట్టి ఒక ముఠాగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఆ నేతల పార్లమెంటరీ పార్టీ పదవులను ఊడబెరికి విధేయు లతో నింపారు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ ఆమె ప్రకటన చేశారు.

వెనువెంటనే పార్టీ అత్యున్నత స్థాయి సంఘం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమా వేశమై సోనియా అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందేనని తీర్మానించింది. సీనియర్‌ నేతలు అడిగిం దేమిటి?  నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణ పరాభవం చవిచూశాక అందుకు నైతిక బాధ్యతవహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ స్థానంలో ఒక ‘ఫుల్‌ టైం’ నాయకత్వం వుండేలా చూడమని విన్నవించుకున్నారు. ‘పార్టీ భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. దేశం కూడా సంక్షోభంలో వుంది. అందుకే దాపరికం లేకుండా, నిర్మొహమాటంగా వాస్తవా లేమిటో తేటతెల్లం చేస్తున్నామ’ని చెప్పారు. రాహుల్‌ మళ్లీ వచ్చి పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చుంటా నంటే వీరిలో చాలామంది కాదనకపోవచ్చు. వారి అభ్యంతరమల్లా ఆ పదవిని పూర్తికాలం బాధ్య తగా పరిగణించమనే! అధ్యక్ష పదవినుంచి వైదొలగిన సందర్భంలో తన సోదరి ప్రియాంకపై ఒత్తిళ్లు తీసుకురావడాన్ని గమనించి ఆమె కూడా బాధ్యతలు స్వీకరించే ప్రశ్నే లేదని రాహుల్‌ కుండ బద్దలు కొట్టారు. తెరవెనక ఆయన్ను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక చివరకు సోనియాగాంధీయే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధపడ్డారు. ఏడాదిన్నర గడిచినా పూర్తికాలం బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు.

లేఖకులంతా ఇన్నాళ్లూ సోనియాకు వీర విధేయులు. పార్టీ ఈ స్థితికి దిగజారడంలో వీరిలో కొందరి పాత్ర కూడా కాదనలేనిది. వివిధ రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేస్తూ, కొత్త ఆలోచనలతో ముందుకొస్తూ పార్టీని పటిష్టపరిచేవారిపై అధిష్టానానికి చాడీలు చెప్పి ఇబ్బందులు సృష్టించడంలో, నిష్క్రమించేలా చేయడంలో కొందరు కీలకపాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో బలగంలేని తమ అనుయాయులకు చోటిచ్చి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనపడటానికి దోహదపడ్డారు. ఇప్పుడు పుట్టి మునిగాక తమను తాము వేరుపరుచుకుని తప్పంతా అధినాయకత్వానిదేనంటున్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో పరాజయ పరంపర కొనసాగుతుంటే... ఓడినచోటల్లా నాయకత్వ స్థానాల్లో వున్నవారు తప్పుకుంటుంటే... వాటి ప్రభావంతో వేరే రాష్ట్రాల్లో పార్టీ పునాదులు కదలబారుతుంటే స్వీయ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుని ఆ లేఖ రాశారు. ఇది రాశాక కూడా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో, గోవా, కేరళ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉప ఎన్నికల ఫలితాలు సరేసరి. లేఖ రాసినవారి ఉద్దేశం ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడపదల్చుకున్న అధినాయకత్వం చేయాల్సిన పని ఆ నాయకుల్ని పిలిచి మాట్లాడటమే. పార్టీ తమ సొంత జాగీరుగా భావించడం, ప్రశ్నించినవారిని ద్రోహులుగా ముద్రలేయడం, నిష్క్రమించక తప్పని స్థితి కల్పించడంవంటివి ఎంతోకాలం సాగ బోవని గుర్తించడం అవసరం.

అయితే సీనియర్‌ నేతలతో మాట్లాడటానికి ఎంచుకున్న సమయం సంశయాలు రేకెత్తిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు త్వరలో జరగాల్సివుంది. లేఖకుల అసంతృప్తిని ఏదో మేరకు చల్లార్చ కుండా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తే అది కొత్త సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. వారిలో ఎవరైనా బరిలో నిలిస్తే, కాంగ్రెస్‌ను రక్షించడానికే ప్రయత్నిస్తున్నామని మీడియాలో హోరెత్తిస్తే పార్టీ మరింత బజారున పడుతుంది. వర్కింగ్‌ కమిటీకి ఎంపిక కాకుండా ఎన్నిక జరగాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. అది కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. సాధారణంగా మంచి టీమ్‌గా అక్కరకొస్తారని భావించినవారిని వర్కింగ్‌ కమిటీకి ఎంపిక చేయడం కాంగ్రెస్‌ అధి నేతల సంప్రదాయం. దానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరితే జవాబు చెప్పుకోవడం పార్టీకి కష్టమవుతుంది.

అయితే లేఖరాసినవారు ఇంతవరకూ సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడ లేదు. తమ నాయకురాలు ఆమేనని ఇప్పటికీ చెబుతున్నారు. పరిస్థితి ఇలావున్నప్పుడే ఆ నాయకు లను మచ్చిక చేసుకోవడం అవసరమని సోనియా భావించి వుండొచ్చు. అయితే వారిలో ఎందరు ఆమె చెప్పినట్టు విని దారికొస్తారన్నదాన్నిబట్టి సంస్థాగత ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం వుంటుం దని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన తమ నిర్వాకమే పార్టీని ఈ స్థాయికి తెచ్చిందని, ఈ తీరును మార్చుకోనట్టయితే భవిష్యత్తు వుండదని ఇప్పటికైనా సోనియా గాంధీ గ్రహిస్తే మంచిదే. ఎల్లకాలమూ తాత్కాలిక ఏర్పాట్లతో బండి లాగించవచ్చుననుకుంటే అది అనర్థదాయకమే అవుతుంది. పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడం, సంస్థ కోసం నిజంగా కష్టపడేవారిని గుర్తించి బాధ్యతలు అప్పజెప్పడం వంటివి చేస్తేనే జనం ఏదో మేరకు ఆ పార్టీని విశ్వసిస్తారు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top