ప్రపంచానికి పెద్దన్న కావాలని...

Sakshi Editorial Xi Jinping Comments China Parliamentary Conference

కొన్నిసార్లు మౌనం, మరికొన్నిసార్లు మాటలు కీలకం. బాహ్య అర్థానికి మించిన సందేశాన్ని అవి బట్వాడా చేయగలవు. సోమవారం నాటి చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ముగింపు ప్రసంగంలోని మాటలు అలాంటివే. ఆయన ఇచ్చిన సందేశం ఒకటే – చైనా ఈజ్‌ బ్యాక్‌! కనివిని ఎరుగని రీతిలో మూడోసారి మరో అయిదేళ్ళ పాటు చైనా దేశాధ్యక్ష పీఠాభిషిక్తుడైన షీ మాటలు జోరుగా సాగాయి.

చైనా భద్రత, అభివృద్ధి, సార్వభౌమాధికారాల్ని పరిరక్షించేలా సైన్యాన్ని ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌’లా తయారుచేస్తామని చెబుతూ, ప్రపంచ పాలనలో బీజింగ్‌ ‘క్రియాశీలక పాత్ర పోషిస్తుంద’ని ప్రకటించారు. సంఖ్యాపరంగా ప్రపంచంలో అతి పెద్దదైనా ఏటా ఒకసారి, రెండువారాలే అంతా కలిసే చైనా పార్లమెంట్‌లో 3 వేల మంది సభ్యుల్లో ఉత్సాహం నింపారు.

మరోపక్క బద్ధశత్రువులైన సౌదీ అరేబియా– ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిర్చి, ఊహించని దౌత్యవిజయం సాధించారు. ఈ మాటలు, చేతలు చూస్తే షీ తనను తాను ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా చిత్రించుకొంటున్నారన్న మాట. విశ్వవేదికకు చైనాయే సారథి అని చెబుతున్నారన్న మాట.

గత కొన్ని తరాల్లో షీ లాంటి నేత చైనాలో కనిపించరు. నిజానికి, చైనా ప్రభుత్వ పాలనా వ్యవస్థలో అధ్యక్షుడి పనులు లాంఛనప్రాయమే. కానీ, 69 ఏళ్ళ షీ అధికారమంతా ఇటు కమ్యూనిస్ట్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగా, అటు కేంద్ర మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ) ఛైర్మన్‌ హోదాల ద్వారా సంక్రమించినవే. గత అక్టోబర్‌లో పార్టీ మహాసభలో ఆయనకు ఆ రెండు హోదాలూ దక్కాయి.

దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఏడుగురు సభ్యుల పొలిట్‌బ్యూరో స్థాయీ సంఘంలో మొత్తం తన విధేయులతో నింపేశారు. అప్పుడే దేశాధ్యక్షుడిగా మూడోసారి ఆయన బాధ్యతలు చేపడతారని ఊహించారు. మావో లాంటి నేతలు సైతం పదవిలో రెండుసార్లే ఉండగా, ఆ ఆంక్షను 2018లో మార్చివేసిన షీ ఆ దిగ్గజాలను అధిగమించేశారు.

జీరోకోవిడ్‌ విధానం నుంచి దేశం బయట కొస్తున్న వేళ, షీ తన పాలనాధికారాన్ని పటిష్ఠం చేసుకుంటున్నారు. బలోపేతుడైన తన సారథ్యంలో పార్టీలో అధికార కేంద్రీకరణ అనేక సమస్యలకు పరిష్కారమని భావిస్తున్నారు. అందుకే, రాగల కొన్నేళ్ళలో చైనా దశ, దిశను తెలిపే సందర్భమని తాజా వార్షిక పార్లమెంటరీ సమావేశం (నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌), చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ (సీపీపీసీసీ)లను అంతా ఆసక్తిగా చూశారు. 

అక్కడే షీ తనకు దీర్ఘకాలిక మిత్రుడూ, కమ్యూనిస్ట్‌ పార్టీలో రెండో అతిపెద్ద స్థానంలో ఉన్న లీ చియాంగ్‌ను కొత్త ప్రీమియర్‌గా కూర్చోబెట్టారు. జీరో–కోవిడ్‌ అంటూ మూడేళ్ళ పాటు ప్రపంచానికి దూరంగా గడిపిన చైనా దౌత్యవేత్తలతో పాటు షీ ఇక సరిహద్దులు దాటి, అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

వరుస పర్యటనలతో వివిధ దేశాలతో సంబంధాలను పెంచు కోవాలని చూస్తున్నారు. అదే సమయంలో మరో అగ్రరాజ్యం అమెరికాతో మాటలకు దూరం జరుగుతున్నారు. చైనా రక్షణశాఖ కొత్త మంత్రిగా లీ షాంగ్‌ఫూను నియమించడం ఒక రకంగా అలాంటి పనే. నిజానికి, రష్యా రక్షణ రంగంతో అంటకాగుతున్నారంటూ 2018 నుంచి సదరు లీ మీద అమెరికా ఆంక్షలు పెట్టింది.

తీరా ఇప్పుడు అదే వ్యక్తిని రక్షణ మంత్రిని చేయడంతో – అమెరికా, చైనాల మధ్య సైనిక చర్చలు మరింత కష్టమవుతాయి. గత ఆగస్ట్‌లో అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ సందర్శన నుంచి– ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు నిలిచిపోయాయి. 

అయితే రష్యాతో అనుబంధాన్ని కాపాడుకోవడమే షీ లక్ష్యం. మాస్కోకు మిత్రుడైన లీ నియామ కంతో ఆ మాట చెప్పకనే చెప్పారు. రష్యా – ఉక్రెయిన్‌ల యుద్ధంలో తటస్థంగా ఉన్నామని డ్రాగన్‌ పైకి చెబుతోంది. కానీ, ఆంతరంగికంగా రష్యాకు చైనాధిపతి మద్దతు బహిరంగ రహస్యమే. గత నెల లోనే చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్‌ యీ మాస్కో వెళ్ళి పుతిన్‌ను కలిసి, చైనా – రష్యాల అనుబంధాన్ని ‘ఏ మూడో పార్టీ శాసించలేదు’ అనడమే అందుకు సాక్ష్యం.

ఇప్పుడిక షీ స్వయంగా రష్యా వెళ్ళి పుతిన్‌ను కలవనున్నారు. అమెరికా ప్రపంచ పెద్దన్న పాత్రకు అడ్డుకట్ట వేసి, ఆ స్థానాన్ని దక్కించుకో వాలన్న డ్రాగన్‌ వ్యూహం అనూహ్యమేమీ కాదు. సోవియన్‌ యూనియన్‌ పతనానంతరం మూడు దశాబ్దాలకు మళ్ళీ స్పష్టంగా ముందుకొచ్చిన ద్విధ్రువ ప్రపంచపు ఉద్రిక్తతలూ అనివార్యమే. భౌగో ళిక రాజకీయాల్లోని ఈ మార్పుల్ని పొరుగున్న భారత్‌ గమనించాలి. స్వీయ భద్రత చూసుకోవాలి.   

ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతున్న షీ సైతం అభివృద్ధికి పునాది భద్రత అనీ, సౌభాగ్యం వెల్లివిరియాలంటే స్థిరత్వం ఉండాలనీ ప్రస్తావించారు. ఆ స్పృహతో భౌగోళిక ప్రాబల్య విస్తరణ, తైవాన్, భారత్‌ ప్రాదేశిక వివాదాల లాంటివాటి జోలికి పోకుండా, సౌదీ అరేబియా – ఇరాన్‌ ఒప్పందం లాంటి అనూహ్య దౌత్య విజయాలతో విశ్వవేదికపై డ్రాగన్‌ తన ఇమేజ్‌ను పెంచుకుంటే మంచిదే. కానీ, ఎగిరే బెలూన్ల గూఢచర్యం లాంటివి మానాలి.

షింజియాంగ్, హాంగ్‌కాంగ్‌ లాంటి చోట్ల మానవ హక్కులపై పాశ్చాత్య దేశాల ఆందోళనల్ని పోగొట్టాలి. సరిహద్దు తగాదాల కన్నా ఆర్థిక పురోగతికి ప్రాధాన్యమిస్తూ, చైనా అడుగు ముందుకేస్తేనే అది ఆశిస్తున్న ప్రాబల్య పాత్ర సాధ్యమేమో! ఆర్థికంగా పోటీ ఉండవచ్చేమో కానీ, సరిహద్దు ఘర్షణలతో ఎవరికీ సౌభాగ్యం సాధ్యం కాదు. పదేళ్ళ క్రితం అవినీతిపై పోరు అంటూ ముందుకు దూసుకొచ్చి, పెరిగిన నిరుద్యోగ రేటు, తగ్గిన కొనుగోళ్లతో అస్తుబిస్తవుతూ, ఇప్పటికే జనంలో ప్రతిష్ఠ దెబ్బతిన్న షీ జిన్‌పింగ్‌కు తన లక్ష్యంతో పాటు ఆ సంగతి తెలియదనుకోలేం!  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top