Punjab Politics: పార్టీలో కిరికిరి... రాజకీయ హరకిరి

Sakshi Editorial On Punjab Congress Political Crisis

పూటకో మలుపు.. రోజుకో మార్పు.. వారానికో అజెండా.. నెలకో కొత్త పాత్ర.. సినిమాల్లోనూ లేనంతటి ఉత్కంఠ. పంజాబ్‌లో కాంగ్రెస్‌ రాజకీయం డైలీ సీరియల్‌ భావోద్వేగాలను మించి నడుస్తోంది. పార్టీని విజయపథంలో నడిపిస్తున్న అమరీందర్‌ సింగ్‌ను రాజీనామా గుమ్మం ఎక్కించి, రాష్ట్రంలో 32 శాతం ఉన్న దళితులకు ప్రతినిధిగా చన్నీని పీఠం ఎక్కించి పట్టుమని పదిరోజులైనా కాలేదు. ఇంతలోనే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష స్థానమెక్కిన 72 రోజులకే ‘‘విలువలతో రాజీపడలే’’నంటూ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ కాడి కింద పడేశారు. ఆయన రాజీనామాపై పార్టీలో మల్లగుల్లాలు పడుతుండగానే, బీజేపీలో చక్రం తిప్పుతున్న కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాను అమరీందర్‌ బుధవారం ఢిల్లీలో కలవడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

ఒకపక్క పంజాబ్‌ కుంపటి, మరోపక్క ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలోనూ రగులుతున్న అసమ్మతి. అధిష్ఠానంపై మళ్ళీ నిరసన గళం విప్పిన 23 మంది అసమ్మతి నేతల ‘జీ–23’ బృందం. వెరసి, కేంద్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇప్పుడు అధికార బీజేపీతో కాకుండా, అంతర్గత పోరాటాలతో పొద్దుపుచ్చుతున్న పరిస్థితి. చాలాసార్లు నిర్ణయాలే తీసుకోకపోవడం, తీసుకున్న కొద్ది నిర్ణయాల్లో అనేక తప్పులు– ఇప్పుడు ఈ గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. యువవారసులు రాహుల్, ప్రియాంకల రాజకీయ పరిణతికి ఇది సవాలు. 2022 పంజాబ్‌ ఎన్నికల్లో అమరీందర్‌ బదులు ఆయన ప్రత్యర్థి సిద్ధూను ఎంచుకున్న తప్పు వారిని చిరకాలం వెంటాడనుంది.

అధిష్ఠానం కోరితెచ్చుకున్న కుంపట్లే ఇందులో ఎక్కువ. నిన్నటిదాకా పంజాబ్‌ కాంగ్రెస్‌లో అమరీందర్, సిద్ధూ – వైరి వర్గాలు రెండే. సునీల్‌ జాఖడ్, రణ్‌ధవాలను కాదని, చన్నీని సీఎంను చేయడంతో రాష్ట్రంలో పార్టీ ఇప్పుడు అయిదు వర్గాలైంది. నిత్యపోరాటం సిద్ధూ శైలి. స్వపక్షీయులా, విపక్షీయులా అన్నదానితో సంబంధం లేకుండా రోజూ ఎవరో ఒకరితో పోరాడకపోతే నిద్రపట్టని రాజకీయ అపరిపక్వత ఆయనది. బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మీదుగా కాంగ్రెస్‌ దాకా జెండాలు, అజెండాలు మార్చుకుంటూ వచ్చిన ఆయన, అమరీందర్‌ను గద్దె దింపే దాకా నిద్రపోలేదు. తీరా ఇప్పుడు కొత్త సీఎం, ఆయన చేపట్టిన నియామకాలు తన చెప్పుచేతల్లో లేవని అలిగారు. కళంకితులకు పదవులిచ్చారనే ఆరోపణలు సరేసరి. పదవికి రాజీనామా చేసినా, పార్టీ కోసం పనిచేస్తానని సిద్ధూ ఇప్పటికైతే అన్నారు. కానీ, ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే ఛాన్స్‌ పోయాక, పీసీసీ పీఠమూ వదులుకున్నాక, వచ్చే ఎన్నికలలో నిలిచేదెవరో – గెలిచేదెవరో తేలని పరిస్థితుల్లో సిద్ధూ ఎన్నాళ్ళు తన మాట మీద ఉంటారో తనకే తెలీదు. 

కొత్త సీఎం చన్నీకి ఇప్పుడు పరిపాలన కన్నా పార్టీలో సర్దుబాట్లకే సమయం సరిపోతోంది. రాష్ట్ర డీజీపీ సహా పలువురిని మారిస్తే – తన రాజీనామాపై పునరాలోచిస్తానంటూ సిద్ధూ షరతులు పెట్టినట్టు ఓ వార్త. ఇప్పటికే రకరకాల షరతులతో కాంగ్రెస్‌లో అనూహ్యంగా ఈ స్థాయికొచ్చిన ఈ మాజీ క్రికెటర్‌ ఒత్తిడికి అధిష్ఠానం మళ్ళీ తలొగ్గుతుందా అన్నది ఆసక్తికరం. అదే చేస్తే కోరి నెత్తినపెట్టుకున్న సిద్ధూకు అధిష్ఠానం లొంగిపోయినట్టు ఉంటుంది. పోనీ సిద్ధూను కాదని, ‘ప్లా¯Œ  బి’తో మరొకరిని పార్టీ ప్రెసిడెంట్‌ను చేసినా అదీ కష్టమే. అటు అమరీందర్‌నూ, ఇటు సిద్ధూను వదులుకొని, రేపు రాష్ట్ర ఎన్నికలకు బలమైన సారథి లేకుండానే పంజాబ్‌ బరిలోకి కాంగ్రెస్‌ దిగాల్సిన దుఃస్థితి. కాంగ్రెస్‌కు ఇది ముందు నుయ్యి, వెనుక గొయ్యి.

బీజేపీ అమిత్‌షాతో కాంగ్రెస్‌ మాజీ సీఎం అమరీందర్‌ ముప్పావు గంట భేటీ భవిష్యత్‌ పరిణామాలకు బలమైన సూచిక. ఈ భేటీలో కొత్త సాగుచట్టాలు, రైతు ఉద్యమంపై మాట్లాడుకున్నామని ఈ అసంతృప్త కాంగ్రెస్‌ నేత ట్వీటారు. కానీ, భేటీ ముగిసిపోగానే, ఈ మాజీ ఆర్మీ ఆఫీసర్‌ మీడియాకు దొరక్కుండా వెనుక గేటు నుంచి వెళ్ళిపోవడం కథలో కొత్త మసాలా. ‘కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్‌ విషయంలో జాతీయ ప్రయోజనాలే కీలకం, సిద్ధూను గెలవనిచ్చేది లేద’న్నది అమరీందర్‌ కొద్దికాలంగా పదే పదే చేస్తున్న భీష్మప్రతిజ్ఞ. మరి, దేశీయాంగ శాఖ మంత్రితో తాజా భేటీ దేశ ప్రయోజనం కోసమా, లేక అమరీందర్‌ పార్టీ మారనున్నారనడానికి సంకేతమా? ఇవాళ కాకుంటే, రేపు అది బయటపడనుంది.

వరుస సంక్షోభాల్లో ఉన్న కాంగ్రెస్‌ వాటి నుంచి ఎలా బయటపడుతుందన్నదే బేతాళప్రశ్న. ఇప్పటికే జితిన్‌ ప్రసాద్, సుస్మితా దేవ్, గోవా మాజీ సీఎం ఫెలీరో– ఇలా కాంగ్రెస్‌ కీలక నేతలు పలువురు పార్టీని వీడారు. ‘జీ–23’ గ్రూపు అసమ్మతి నేతలు ఇదే అదనుగా మళ్ళీ గళమెత్తారు. ‘‘మాది జీ హుజూర్‌ గ్రూపు కాదు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ కావాల్సిందే’’ అన్నది సిబాల్‌ ధిక్కారం. మరోపక్క బుధవారమే ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డజను మందికి పైగా ఢిల్లీకి రావడం రానున్న మరో సంక్షోభానికి సూచన. బిహారీ యువనేత కన్హయ్య కుమార్, గుజరాతీ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ లాంటివారిని తెచ్చుకొని, పార్టీని బలోపేతం చేస్తున్నామని సంబరపడుతున్న అధిష్ఠానానికి ఇవన్నీ చిత్తాన్ని చీకాకుపరిచే చెప్పులోని రాళ్ళు, చెవిలోని జోరీగలు. అంతర్గత కలహంతో పంజాబ్‌లో ‘ఆప్‌’కూ, పడక్కుర్చీ రాజకీయాలతో జాతీయస్థాయిలో తృణమూల్‌ కాంగ్రెస్‌కూ ఈ జాతీయపార్టీ తన ఎన్నికల సానుకూలతను కోల్పోతోంది. ఈ రాజకీయ ‘హరకిరి’కి (ఆత్మహత్యకు) ఆ పార్టీ తనను తాను తప్ప వేరెవరినీ తప్పు పట్టడానికి లేదు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top