ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!

Sakshi Editorial On English Writings The JCB Prize for Literature

అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు.

ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్‌ ఫర్‌ లిటరేచర్‌’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్‌ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్‌ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం.

‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్‌ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్‌ జావేద్‌.

2022లో ‘ద ప్యారడైజ్‌ ఆఫ్‌ ఫుడ్‌’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రై జ్‌’ను స్వీకరించారు. ‘నేమత్‌ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్  ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్‌ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. 

అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్‌ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్‌ వ్యాపారవేత్త జోసెఫ్‌ సిరిల్‌ బామ్‌ఫోర్డ్‌ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్‌ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు.

ఏప్రిల్‌ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్‌సైట్‌లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్‌ వర్క్‌’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్‌ లిస్ట్‌ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్‌ లిస్ట్‌ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది.

ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్  డేస్‌’ నవలకుగానూ బెన్యామిన్  2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్‌ హబీబ్‌ ఆంగ్లంలోకి అనువదించారు.

2020 సంవత్సరానికి ‘ముస్టాష్‌’ నవలకుగానూ ప్రైజ్‌ గెలుచుకున్న ఎస్‌.హరీశ్‌ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్ పగల్‌ నేరత్తు మయక్కమ్‌’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్‌ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాక్వీ’ని కూడా ఈ ప్రైజ్‌ వరించింది. రచయిత ఎం.ముకుందన్ . 2019లో ‘ద ఫార్‌ ఫీల్డ్‌’ నవలకుగానూ మాధురీ విజయ్‌ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు.

పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు.

కానీ ఆ ‘గేమ్‌’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అయితే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు!  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top