టీమ్‌ కమలం – 2024

Sakshi Editorial On BJP

యుద్ధం సమీపిస్తున్నప్పుడు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సిందే! వరుసగా మూడోసారీ ఢిల్లీ గద్దెనెక్కాలనే ముమ్మర ప్రయత్నంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ పనే చేస్తోంది. రానున్న 2024 ఎన్ని కల దృష్ట్యా పార్టీలో భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలిగా పేరున్న పార్లమెంటరీ బోర్డ్‌నూ, కేంద్ర ఎన్నికల కమిటీనీ బుధవారం పునర్వ్యవస్థీ కరించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పేర్లు, ఈ పునర్వ్యవస్థీకరణ జరిగిన తీరు అటు సొంత పార్టీ వారికీ, ఇటు సామాన్య ఓటర్లకూ తగిన సంకేతాలిస్తోంది. నితిన్‌ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్‌ లాంటి వారికి చెక్‌పెడుతూనే, తక్షణ ఎన్నికల ప్రయోజనాలున్న చోట యడియూరప్ప లాంటి వారిని దువ్వడంలోనూ మోదీ – అమిత్‌ షాల ముద్రే కనిపిస్తోంది.

అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్‌ లాంటి వారి మృతి, వెంకయ్య నాయుడు తదితరుల నిష్క్రమణతో చాలాకాలంగా బోర్డులో 5 ఖాళీలున్నాయి. కొన్నేళ్ళుగా వాటి ఊసే వదిలేసి, మరో అయిదు నెలల్లో జనవరి 20తో నడ్డా పదవీకాలం ముగుస్తుందనగా భర్తీ చేయడం విచిత్రమే. పార్లమెంటరీ బోర్డులో పేరున్న సీనియర్లయిన కేంద్ర మంత్రి గడ్కరీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లకు ఇద్దరికీ ఉద్వాసన పలికారు. ఎన్నికల దృష్ట్యా ఎక్కడికక్కడ బలం పెంచుకోవాలని చూస్తున్న కమలనాథులు తెలంగాణకు చెందిన కె. లక్ష్మణ్‌ సహా కొత్తగా ఆరుగురికి స్థానం కల్పించారు.

అలా బోర్డ్‌ సభ్యుల సంఖ్య 11కు చేరింది. ఓబీసీ (కె. లక్ష్మణ్, హరియాణా మాజీ ఎంపీ సుధా యాదవ్‌), ఎస్సీ (ఉజ్జయిన్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణ జతియా), సిక్కు (జాతీయ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురా) – ఇలా వివిధ సామాజిక సమీకరణాలు, ఉత్తర– దక్షిణాదులతో పాటు ఈశాన్యం (గిరిజన నేత – కేంద్ర మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌) – ఇలా భౌగోళిక లెక్కలు వేసుకొని మరీ ఈ మార్పులు చేశారనేది స్పష్టం. 

బోర్డ్‌లోని 11 మందితో పాటు పార్టీ నామినేట్‌ చేసే ముగ్గురు, ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా మహిళా మోర్చా ఛీఫ్‌ ఉండే మొత్తం 15 మంది సభ్యుల పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లోనూ మోదీ మార్కే! వివాదంలో ఇరుక్కున్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ సహా ముగ్గురు పాతవారికి స్వస్తి పలికారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, ఓం మాథుర్‌లకు కొత్తగా చోటిచ్చారు. పార్టీలోని నలుగురు అగ్రశ్రేణి నేతల్లో ఒకరైన గడ్కరీకి బోర్డు నుంచి ఉద్వాసన ఒకింత ఆశ్చర్యకరమే.

అయితే, పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నంత కాలం సంఘ్‌ పరివార్‌ సైతం తమను కాదనదని మోదీ – షా ద్వయానికి తెలుసు. ఈ గుజరాతీ మిత్రులు పార్టీపై తమ పట్టు చూపడానికి పునర్వ్యవస్థీకరణను అంది పుచ్చుకున్నారు. ఆరెస్సెస్‌కు సన్నిహితుడూ, మితవాద ముఖచిత్రమైన గడ్కరీ ఎన్నికల రాజకీయాల పట్ల ఇటీవల ప్రకటించిన వైరాగ్యం, అభిప్రాయాలు అధినేతల్ని చీకాకు పరిచాయి. వ్యక్తుల కన్నా వ్యవస్థ, సిద్ధాం తమే గొప్పదని నిరూపించడానికి గడ్కరీని తప్పించారని ఓ విశ్లేషణ. పార్టీలో మార్పులు తెచ్చి, 2009 నాటికే అధ్యక్షుడైన గడ్కరీ ఇప్పుడు బోర్డ్‌కూ, సీఈసీకీ వెలుపలే మిగిలిన పరిస్థితి.  

పార్టీలో ఆధిపత్యానికి అడ్డు లేకుండా మోదీ చూసుకున్నారు. తనను మించి ఎదుగుతున్నాడని పేరుపడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పార్టీలో బలం పెరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆ మధ్య యూపీ ఎన్నికలు, రానున్న లోక్‌సభ ఎన్నికల రీత్యా ఆయనను సహిస్తూ వస్తున్నా, విధాన నిర్ణాయక మండలిలో చోటివ్వలేదు. ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలుకుతానని చెప్పిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పను బోర్డులోకి తీసుకోవడం వెనుక వ్యూహం సుస్పష్టం. అంతర్గత కలహాలు, ఆరోప ణల వల్ల సీఎం కుర్చీ వదులుకోవాల్సి వచ్చిన యడియూరప్ప కొన్నాళ్ళుగా పార్టీపై అలకబూనారు.

లింగాయత్‌ ఓటుబ్యాంక్‌ ముఖ్యమైన కర్ణాటక ఎన్నికలు మరి 9 నెలల్లోనే ఉన్నాయి. బీజేపీ పాలిత ఏకైక దక్షిణాది రాష్ట్రంలో బలమైన ఈ లింగాయత్‌ నేతను దూరం చేసుకోవడం తెలివైనపని కాదని కమలనాథులకు తెలుసు. అందుకే కినుక వహించిన కురువృద్ధుడిని వ్యూహాత్మకంగా లాలించి, బుజ్జగించి ఇటు బోర్డులో, అటు సీఈసీలో చేర్చారు. 1989 తర్వాత ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాని కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆయన కీలకం కానున్నారు. 

ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడే కొత్తవారిని ప్రోత్సహిస్తూ, రాగల పాతికేళ్ళకు సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఫడ్నవీస్, భూపేంద్ర యాదవ్‌ లాంటి కొత్త నేతలకు పార్టీలో ప్రాధాన్యం పెంచారనుకోవాలి. యువ రక్తం నింపే సాకుతో ఇదే అధినేతలు గతంలో అద్వానీ, మురళీమనోహర్‌ జోషీలను నామమాత్ర పార్టీ మార్గదర్శక్‌ మండలికే పరిమితం చేశారు.

మరి ఇప్పుడు ఏడున్నర పదులు దాటిన యడియూ రప్ప, జతియాలకు బోర్డ్‌లో ఎలా స్థానమిచ్చారంటే ఎన్నికల అవసరాలనే అనుకోవాలి. గడ్కరీకి బదులు అదే వర్గానికి చెందిన నాగ్‌పూర్‌ వాసి, ఆరెస్సెస్‌ సన్నిహితుడైన ఫడ్నవీస్‌కు సీఈసీలో చోటిచ్చి సమతూకం చేసేశారు. అయితే, ఆ మధ్య కేంద్ర మంత్రివర్గంలో నక్వీ, ఇప్పుడు సీఈసీలో షానవాజ్‌ల ఉద్వాసనతో ముస్లిమ్‌ల ప్రాతినిధ్యం లోపించింది. ఆ లోటు భర్తీకి కాషాయపార్టీ వ్యూహమేమిటో చూడాలి. మొత్తానికి గెలిచినా, ఓడినా ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికకు అవిశ్రాం తంగా సిద్ధమవడమే మంత్రమైన మోదీ – షా మార్కు కొత్త ‘బీజేపీ టీమ్‌ 2024’ సిద్ధమైంది.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top