ద్వారకాతిరుమల: స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సాగింది. ఎన్నికల్లో పారదర్శకత లోపించింది. గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూర్ల లక్ష్మీపురంలో బ్యాలెట్ పేపర్లపై ముందే సిరా మరకలు కనిపించగా.. తిరుమలంపాలెంలో వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్లను బయటకు పంపేయడం కలకలాన్ని రేపాయి. ఈ ఘటనలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు.
ఫ తూర్ల లక్ష్మీపురంలో ఓటు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకుడు దాకారపు అగ్గియ్యకు బ్యాలెట్ పేపర్‌పై కమలం గుర్తు వద్ద ముందే సిరా మరక కనిపించింది. దీనిపై పోలింగ్ అధికారిని ప్రశ్నించగా పొరపాటున ఇంకు అంటుకుందని సమాధానమిచ్చారు. అనుమానంతో బ్యాలెట్ బుక్‌లోని ఇతర పేజీలను పరిశీలించగా, అన్నింటిలోనూ కమలం గుర్తుపై సిరా మరకలు కనిపించాయని అగ్గియ్య తెలిపారు. ముందుగానే కమలం గుర్తుపై ముద్రలు వేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లు ఎలాగో ముద్ర ఉంది కధ అని బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే ఓటు వారికి పడుతుందని, ఇతర గుర్తులపై ముద్ర వేస్తే బ్యాలెట్లు చెల్లకుండా పోవాలన్న కుట్రతో ఇదంతా చేశారని అగ్గియ్య ఆరోపించారు. ఈ క్రమంలోనే అగ్గియ్యతో పాటు, ఆయన భార్య, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ పార్టీ శ్రేణులతో కలిసి లక్ష్మీపురంలోని రహదారిపై ఆందోళనకు దిగారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బుసనబోయిన విజయలక్ష్మి సైతం అక్కడికి చేరుకుని ఇవేం ఎన్నికలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పొరపాటున ఇంకు అంటిన విషయాన్ని ఆర్వోకు లేఖ ద్వారా తెలియజేస్తానని పోలింగ్ అధికారి చెప్పినట్లు ఎస్సై టి.సుధీర్ వివరించారు. అయితే ఎన్ని ఓట్లు రిగ్గింగ్‌కు గురయ్యాయో ఎలా గుర్తిస్తారని, రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుబట్టారు. ఓటమి భయంతోనే కూటమి నాయకులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారుల సహకారంతో రిగ్గింగ్ చేసి గెలవడం కూడా గెలుపేనా? అని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న తమను పోలీసులు బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, కేసులు నమోదు చేస్తామని భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్ హెచ్చరించి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేశారు.
ఏజెంట్లను బయటకు పంపి..
తిరుమలంపాలెంలో వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్ల తొలగింపు వివాదాస్పదమైంది. ముందురోజు ఏజెంట్ ఫారాలు సమర్పించలేదనే కారణంతో ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత 7.45 గంటలకు వచ్చిన గదుల మహేష్‌బాబు, వెలిగట్ల ఫణికుమార్, సయ్యద్ యాకోబు, కంతేటి బాబీ, బొప్పన చిన్న, మిడతా చందు, సిరిమల్లి సాయిలను తొలుత పీఓ అనుమతించలేదు. ఆర్వోకు ఫోన్ చేసిన అనంతరం వారిని లోపలికి అనుమతించి ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. అయితే కొద్దిసేపటికే టీడీపీ నాయకులు అభ్యంతరం తెలపడంతో తిరిగి ఆర్వోకు ఫోన్ చేసిన పీఓ.. మూడు బూత్‌లలోని వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపించారు. టీడీపీ నేతలు వన్‌సైడ్‌గా పోలింగ్ జరుపుకొంటున్న తీరుపై విమర్శలు రావడంతో భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ అక్కడికి చేరుకుని ఏజెంట్లతో మాట్లాడారు. అనంతరం మీడియా సమక్షంలో పీఓను వివరణ కోరగా, ప్రత్యర్థి పార్టీ అభ్యంతరం తెలపడంతో వారిని లోపలికి అనుమతించలేమని ఆమె స్పష్టం చేశారు. పీఓ నిర్ణయమే తుది నిర్ణయమని పోలీసులు చెప్పడంతో ఏజెంట్లు వెనుదిరిగారు. తమ ఏజెంట్లు లేకుండానే టీడీపీ నాయకులు పోలింగ్ నిర్వహించుకున్నారని, ఓటమి భయంతోనే వారు ఇలా చేశారని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆరోపించాయి. ఇదే పంచాయతీ పరిధిలోని పావులూరివారిగూడెంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు మోటూరి శ్రీనివాసరావు, బంటుమిల్లి బాలకృష్ణలను సైతం ఇదే కారణంతో బూత్ నుంచి బయటకు పంపించినప్పటికీ కొద్దిసేపటికే తిరిగి అనుమతించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందనే భయంతోనే ఆ పార్టీ నాయకులు గెలుపు కోసం దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, తూర్ల లక్ష్మీపురంలో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు దాకారపు అగ్గియ్య డిమాండ్ చేశారు.
అన్యాయం చేశారంటూ ఎస్సై సుధీర్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న
వైఎస్సార్ సీపీ నాయకులు బంగారమ్మ, అగ్గియ్య తదితరులు
ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీపురంలో
రహదారిపై ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
ఫ కమలం గుర్తుపై ముందుగానే ముద్రలు
ఫ తూర్ల లక్ష్మీపురంలో
అక్రమాలు బహిర్గతం
ఫ తిరుమలంపాలెంలో
వైఎస్సార్ సీపీ ఏజెంట్ల తొలగింపు
ఫ రిగ్గింగ్ జరిగిందంటూ
ఆ పార్టీ ఆందోళన


