అనపర్తి నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా సాగిస్తున్న రెడ్‌బుక్ పాలనకు కొనసాగింపుగా పోలింగ్ రోజున కూడా కూటమి నాయకులు అరాచకాలకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో టీడీపీ, బీజేపీ నాయకులు అన్నిరకాల ప్రయత్నాలూ సాగించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ శ్రేణులను కవ్విస్తూ అరాచకపర్వానికి తెరలేపారు. పోలింగ్ రోజున కూడా గొడవలకు ప్రయత్నించారు. అనపర్తి బాలికల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ అక్కడికి టీడీపీ నాయకులు చేరుకుని అలజడి రేపారు. ఆ బూత్ సమీపంలో ప్రచారం చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఇదేంటని వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గొలుగూరి సరోజని కుమారుడు ప్రశ్నించడంతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ నాయకుడు మల్లిడి కృష్ణారెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడి చేయడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.


