వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి పరిశీలన

Nov 6 2026 12:15 AM | Updated on Nov 6 2026 12:15 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను బొమ్మూరులోని కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌ పరిశీలించారు. జిల్లాలోని ఎన్నికలు జరుగుతున్న 20 మండలాల్లో ఉన్న సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలతో పాటు, ప్రత్యేకంగా గుర్తించిన పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని జేసీ పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని ఆయన తెలిపారు. అలాగే, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ప్రతి రెండు గంటలకు ఒకసారి జిల్లాలోని అన్ని మండలాల వారీగా పోలింగ్‌ శాతం, నమోదైన ఓట్ల వివరాలను సేకరిస్తూ, పోలింగ్‌ సరళిని నిరంతరం సమీక్షించామని అన్నారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మక్సుద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

నేడు పొగాకు బోర్డు

చైర్మన్‌ పర్యటన

దేవరపల్లి: మురుసు తుపానుకు నష్టపోయిన పొగాకు తోటలను పొగాకు బోర్డు చైర్మన్‌ సీహెచ్‌ హేమంత్‌ కుమార్‌ శుక్రవారం పరిశీలించనున్నారు. ఈ మేరకు దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో పర్యటించనున్నట్టు బోర్డు రీజినల్‌ మేనేజరు జె.సురేంద్ర కుమార్‌ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని సంగాయగూడెంలో చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ పర్యటిస్తారని తెలిపారు.

ఓటేసి వస్తూ.. వరద

నీటిలో ఇద్దరి గల్లంతు

మరొకరు సురక్షితం

తాళ్లపూడి/ దేవరపల్లి: ఓటెయ్యడానికి వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురిలో ఇద్దరు వరద నీటిలో గల్లంతు కాగా, మరొకరిని స్థానికులు రక్షించారు. గోపాలపురం మండలం చిట్యాల సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన మేడిద విజయ్‌కుమార్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో అప్రైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటు వేసేందుకు చిట్యాల గ్రామానికి తన మేనకోడలు, మరొకరితో కలసి వెళ్లారు. అక్కడి నుంచి అన్నదేవరపేటకు తిరిగి బైక్‌పై వస్తుండగా, చిట్యాల సమీపంలో కొవ్వాడ వరద నీటిలో బైక్‌ అదుపుతప్పి విజయ్‌కుమార్‌, అతని మేనకోడలు గల్లంతయ్యారు. మూడో వ్యక్తిని స్థానికులు కాపాడినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రలోభాలు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: పరిషత్‌ ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ నాయకులు కడియం మండలంలో ప్రలోభాల వల వేశారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కడియపులంకలో పలు ప్రాంతాల్లో తన అనుచరులతో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకపక్క పోలింగ్‌ జరుగుతుండగానే.. వెంకాయమ్మపేటలో వివాదాస్పద రోడ్డుకు సంబంధించి, తాను సమస్యను ఓటర్లకు పరిష్కరిస్తానని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. అలాగే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మార్ని వాసుదేవరావు తన అనుచరులతో కలసి దుళ్ల బోర్డు స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ సమీపంలోనే ఉదయం నుంచి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని దళితవాడలో ఖాళీ స్థలం ఎంపిక చేస్తే అక్కడ కల్యాణ మండపం నిర్మిస్తానని మార్ని వాసు హామీ ఇచ్చి మరీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే మాధవరాయుడుపాలెం మాజీ సర్పంచ్‌, టీడీపీ రైతు నాయకుడు అన్నందేవుల చంటి గ్రామంలోని హైస్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌లో స్వయంగా ఏజెంట్‌గా విధులు నిర్వహించారు. అక్కడికి వచ్చే ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకే ఈ విధంగా ఏజెంట్‌గా బూత్‌లో కూర్చున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని కొద్దిసేపు చంటిని బూత్‌ నుంచి బయటకు పిలిపించారు. దక్షిణ మండలం డీఎస్పీ శివప్రియ అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. అయితే ఈ లోపు ఏ ఒత్తిడిలు పనిచేశాయో తెలియదుగానీ తిరిగి మళ్లీ అదే బూత్‌లో చంటిని కూర్చోనిచ్చారు. కాగా మండలంలోని పలు పోలింగ్‌ బూత్‌ల్లోకి అధికార పార్టీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు చొరబడి మరీ ప్రచారం చేస్తున్నప్పటికీ అక్కడ బందోబస్తులో ఉన్న సిబ్బంది ఏమాత్రం అడ్డుచెప్పలేదు. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన అభ్యర్థులను పదేపదే అక్కడి నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. దుళ్ల, మురమండ, మాధవరాయుడుపాలెం, జేగురుపాడు, కడియపుసావరం తదితర గ్రామాల్లో ఇదే తరహా పరిస్థితి ఉండడంతో పదేపదే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోలీసులతో వాగ్వాదాలకు దిగాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement