● నీటితో బాట..సారీ
జగన్నాథగిరి నుంచి తుని వెళ్లే తాళ్లూరు రోడ్డులో నాసా సమీపంలో వరదనీరు ప్రవహిస్తుంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఆ నీటిలో నాచు పట్టింది. దీంతో తుని ఎల్‌ఐసీ ఆఫీస్ సమీపంలో ఉన్న రైల్వే అండర్‌పాస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. వాహనాలు వెళ్లకుండా ఇనుప గొలుసులు ఏర్పాటు చేశారు. తాళ్లూరు, వి.కొత్తూరు, లోవకొత్తూరు, తదితర గ్రామాల ప్రజలు తుని వెళ్లేందుకు సుదూర ప్రాంతాలు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా కుమ్మరిలోవ గ్రామ సమీపంలో రోడ్డుపై, టి.తిమ్మాపురం సమీపంలో రోడ్డుపై ఇంకా వరదనీరు ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదనీరు తాండవ నదిపై నిర్మించిన రెండు మినీ రిజర్వాయర్ల పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. –తుని రూరల్
సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే రోడ్డులో భారీగా నీరు చేరింది. మోకాలు లోతులో నీరు ఉండడంతో ప్రయాణం కష్టంగా మారింది. కీలకమైన ఈ దారిలో గోదావరి కాలువ, మరోవైపు వెస్టు ఏలేరు కాలువ పొంగి ప్రవహించడంతో ముంపు బారిన పడింది. ప్రధానంగా వీకే రాయపురం– మాధవపట్నం మధ్యలో చేరిన నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడం కనిపించింది.
–సామర్లకోట


