ఫ పది రోజులుగా అంధకారం
ఫ పోతుమట్ల ప్రజల ఆందోళన
రాజోలు: అర్నబ్ తుపాను వచ్చి పది రోజులైంది.. ఎన్నాళ్లీచీకటి రోజులు.. ఎప్పటికి విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దుతారంటూ విద్యుత్ శాఖపై చింతలపల్లి పంచాయతీలోని పోతుమట్ల ఆవాస ప్రాంతం ప్రజలు ఆందోళనకు దిగారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలంటూ రాజోలు విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం ఎదుట గురువారం బైఠాయించారు. అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ధర్నా చేశారు. విద్యుత్ శాఖ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాలంగి రమేష్ ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ, పది రోజులుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకుండా ప్రజలను అంధకారంలో ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల ఇళ్లకు విద్యుత్ ఇవ్వకుండా, రొయ్యల చెరువులకు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ ఏడీఈని సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏడీఈ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి కార్యాలయంలోకి ఎలాంటి వాహనాలు రాకుండా అడ్డుకొని గేటు మూసివేశారు. తమ గ్రామానికి విద్యుత్ సరఫరా ఇచ్చేవరకు కార్యాలయం నుంచి వెళ్లేది లేదంటూ మహిళలు పట్టుపట్టారు. విద్యుత్తు లేకపోవడంతో మహిళలు, బాలింతలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తాగునీరు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం తమ విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.


