ఫ పొగాకుకు వర్షం దెబ్బ
ఫ రూ.2.50 కోట్ల మేర నష్టం
ఫ తడిచి ముద్దయిన 600 బేళ్లు
దేవరపల్లి: మురసు తుపానుకు పొగాకు రైతులు కుదేలయ్యారు. రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దేవరపల్లి మండలంలో వర్జీనియా పొగాకు రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పొగాకు తోటలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో తోటల్లో ఇసుక మేటలు వేశాయి. సాగు భూములా? ఇసుక తెన్నెలా అన్నట్టు ఉంది. ఇలా వేలాది ఎకరాల్లో పొగాకు తోటలు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.80 వేలు పెట్టుబడి పెట్టి, పొగాకు తోటలను పెంచారు. ముందుగా వేసిన తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంలో ఉండగా, మురుసు తుపాను ముంచేసిందని ఆవేదన చెందుతున్నారు. దేవరపల్లి మండలం సంగాయగూడెం గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో ఇళ్లల్లోకి 10 అడుగుల నీరు చేరింది. సుమారు 5 గంటలు నీరు ఇళ్లల్లో ఉండిపోవడంతో పొగాకు బేళ్లు తడిచి ముద్ధయినట్టు రైతులు కరుటూరి శ్రీనివాస్, సింహద్రి రాము తదితరులు తెలిపారు. గ్రామంలో సుమారు 600 బేళ్లు వరద నీటికి తడిచిపోయినట్టు వాపోయారు. దీని విలువ సుమారు రూ. 2.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇంత దారుణం ఎప్పుడు చూడలేదని వాపోతున్నారు. ఓ పక్క ఇళ్లలోని పొగాకు బేళ్లు తడిచి నష్టపోగా, మరో పక్క వేసిన తోటలు పూర్తిగా కొట్టుకుపోయి, 4 అడుగుల లోతున పొలాలు కోతకు గురైనట్టు తెలిపారు. నష్టపోయిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


