బొత్తుగా పట్టించుకోరేం! | - | Sakshi
Sakshi News home page

బొత్తుగా పట్టించుకోరేం!

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

రాజానగరం: అల్పపీడనం.. ఆపై అర్నబ్‌.. ఇప్పుడు మురసు.. ఇలా తుపానులు విరుచుకుపడుతున్నాయి. వర్షాలు కుమ్మేస్తున్నాయి. గత పది రోజులుగా వర్షాలు జనానికి నరకం చూపుతున్నాయి. ఇదిలా ఉంటే వర్షం పడిన ప్రతిసారీ రాజానగరం గోదారిని తలపిస్తోంది. రాజానగరంలోని రావుల చెరువు నిండడంతో కళింగల ద్వారా నీరు బయటకు వచ్చే తరుణంలో చెరువు గట్టుకు గండి పడకుండా ముందు జాగ్రత్తగా లాకు గేట్లను ఎత్తి వేశారు. దీంతో ఈ నీరంతా ఊరిలోకి చేరుతోంది. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో స్థానిక కొత్త కాలనీ, సుబ్బారావు కాలనీలతో పాటు జాతీయ రహదారి, ఏడీబీ రోడ్డు, ఓల్డ్‌ ఎన్‌హెచ్‌తో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక్కడ మోకాలు లోతు నీరు చేరింది.

ముంపు వచ్చేదిలా..

రాజానగరంలో మూడు రోజుల్లో 180.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటలలోనే 105.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పాటు కానవరం, ఫరిజల్లిపేట గ్రామాల నుంచి ముంపు నీరు ఫరిజల్లిపేటలోని రంగరాయ చెరువు స్లూయిజ్‌ మీదుగా రాజానగరంలోని రావుల చెరువుకు చేరుకుంది. ఈ చెరువులో పొంగి పొర్లుతున్న నీరు కళింగల ద్వారా బయటకు పోటెత్తుతోంది. ఈ క్రమంలో చెరువు గట్టుకు గండి పడకుండా ముందు జాగ్రత్తగా లాకు గేట్లను ఎత్తివేశారు. మంగళవారం రాత్రి నుంచి వరద నీరు క్రమేపీ పెరుగుతూ దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. అధికారులు తాత్కాలిక పనులు చేపట్టినప్పటికీ బుధవారం రాత్రికి కూడా వరద నీటి ఉధృతి తగ్గలేదు.

నేతలు పట్టించుకోక..

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు దిగువకు వెళ్లేందుకు రాజానగరంలో సరైన మార్గాలు లేవు. వర్షాలు వస్తున్న ప్రతి సందర్భంలోనూ ఇదే సమస్య వస్తోంది. రోడ్లు ముంపు బారిన పడుతున్నాయి. జనం నరకం చూస్తున్నారు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయినా సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం కూటమి ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ప్రస్తుతం ఎన్నికల వేళ వారికి ఇది చెంపపెట్టులా మారనుంది.

ఇలా చేస్తే మేలు

దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ఆవశ్యకత ఉంది. జాతీయ రహదారిపై కలవచర్ల జంక్షన్‌లో ఈ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా కల్వర్టును నిర్మించాలి. అయితే రహదారి నిర్మించిన సమయంలో స్థానిక పెద్దలు ఎవరూ శ్రద్ధ తీసుకోకపోవడంతో ఎగువ నుంచి వచ్చే నీరు దిగువకు వెళ్లేందుకు ఒకే 4 అడుగుల వ్యాసంతో ఉన్న ఒకే ఒక తూరను వేశారు. దీంతో పైనుంచి వచ్చే నీటి ప్రవాహం ఇక్కడకు వచ్చేసరికి నిలిచిపోవడంతో వరద నీరు ఎగదన్ని, కాలనీలు, రోడ్లు ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ కనీసం నాలుగు తూరలు వేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.

కష్టాలు.. క‘న్నీళ్లు’

రాజానగరంలోని జాతీయ రహదారి, ఏడీబీ రోడ్ల జంక్షన్లను వరద నీరు ముంచెత్తడంతో బస్సులు, లారీలు, బైకులు సైతం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ మోకాలు లోతు నీరు వస్తోంది. తీరా సాహసించి వెళ్తే వాహనాలు మొరాయిస్తున్నాయి. మంగళవారం రాత్రి కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డు పక్కగా వెళ్తూ బురదలో ఇరుక్కుపోయింది. అందులో ప్రయాణికులను వెంటనే మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి తరలించారు. అలాగే ఏడీబీ రోడ్డు జంక్షన్‌, నూకాలమ్మ గుడి సెంటర్‌, ఎస్‌బీఐ రోడ్డు, టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌, సినిమా థియేటర్‌ ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో జగ్గంపేట, రాజమహేంద్రవరం, కాకినాడ వైపు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు నరకం చూస్తున్నారు. జాతీయ రహదారిపై కలచవర్ల జంక్షన్‌లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రాజానగరంలో ముంపునకు గురైన ప్రాంతాలను తహసీల్దార్‌ దివ్యభారతి పరిశీలించారు. జాతీయ రహదారిపై వేసిన తూర సామర్థ్యం సరిపోక తరచూ ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు.

ఊరే నీరైంది.. దారి గోదారైంది.. ఒక పక్క జాతీయ, మరో పక్క రాష్ట్రీయ రహ‘దారి’ జలదిగ్బంధమైంది.. ఎన్నికల వేళ ఓటర్ల వద్దకు వచ్చే నేతలు ఈ వాటర్‌ కోసం పట్టించుకోక ప్రయాణం దినదినగండంలా మారింది.. విద్యాలయాలకు కేంద్రంగా ఉన్న రాజానగరంలో ఈ పరిస్థితిపై ‘బొత్తు’గా పట్టించుకోక విమర్శలకు తావిస్తోంది. ఈ ‘దారి’దాపుల్లోకి వెళ్లలేక, ప్రత్యామ్నాయ దారిలేక జనానికి నరకం కనిపిస్తోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ సమస్యను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

రాజానగరం ఊరంతా నీరే..

జాతీయ, రాష్ట్ర రహదారులు జలమయం

గ్రామంలో స్తంభించిన జనజీవనం

కూటమి నేతలపై ప్రజల పెదవి విరుపు

స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వంపై చీదరింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement