● వానొస్తే వణుకుతున్న
రాజమహేంద్రవరం
● భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, రాజమహేంద్రవరం: చారిత్రక రాజమహేంద్రవరం నగరం.. నేడు వర్షం కురిస్తే విలవిల్లాడుతోంది. మురసు తుపాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కంబాల చెరువు హైటెక్ బస్టాండ్, కంబాలచెరువు స్వామి వివేకానంద సర్కిల్, వీరభద్రపురం నుంచి పేపరుమిల్లు రోడ్, దేవీచౌక్ నుంచి పేపరుమిల్లు రోడ్, రామచంద్రరావుపేట, నటరాజ్ థియేటర్ రోడ్డు, కోరుకొండ రోడ్డు, శ్యామలా సెంటర్, టీనగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెలుకుల వారి చెరువు రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మారో ఆఫీసు, ఆల్కాట్ గార్డెన్స్, దానవాయిపేట, కోటిపల్లి బస్టాండ్ పరిసరాలు, గోదావరి బండ్ ప్రాంతాలు, లాలాచెరువు, మోరంపూడి జంక్షన్, బొమ్మూరు వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇష్టారాజ్యంగా తవ్వి, వదిలేశారు!
నగరంలో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లను ఎక్కడికక్కడ తవ్వి వదిలేయడం ఇప్పుడు ప్రజలకు శాపంగా మారింది. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల పనులంటూ పలుచోట్ల తవ్వకాలు చేపట్టినా వాటిని పూర్తిచేసే విషయంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్చిపేట నుంచి ఊర్వశి థియేటర్ రోడ్డు, వై.జంక్షన్, జెండా పంజా రోడ్డు, కందకం రోడ్డులో ఇష్టారాజ్యంగా తవ్వేశారు. ప్రధాన కాలువలు, అంతర్గత డ్రెయిన్లు పూడికతో నిండిపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.
రెండున్నరేళ్లుగా ప్రజాప్రతినిధులు ఏం చేసినట్లు?
చిన్నపాటి వర్షానికే నగరం నరకాన్ని తలపిస్తోందని, గత రెండున్నరేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేశారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే నగరాన్ని ఈ దుస్థితికి తీసుకొస్తారా? అని నిలదీస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ నగరాభివృద్ధికి చేసిన పనులేమిటని ప్రశ్నిస్తున్నారు.


